ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. అయితే.. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్ట్ 20కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Supreme Court issues notice to CBI and ED on BRS leader K Kavitha's plea seeking bail in the excise policy case. pic.twitter.com/GmKe5CjgCy
— ANI (@ANI) August 12, 2024
లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైలులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఆమె పెట్టుకున్న తాత్కాలిక, మధ్యంతర బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు నిరాకరించాయి. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయని అరోపిస్తూ మరోసారి కవిత తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ పై విచారణ 2 సార్లు వాయిదాపడి.. ఈ నెల 7న కోర్టు ముందుకు రావాల్సి ఉండగా.. 6వ తేదీనే కవిత తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫైనల్‌గా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా.. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవితకు బెయిల్ వస్తుందన్న భావనలో ప్రస్తుతం ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. దీనికి తోడు కవిత ఆరోగ్యం క్షీణించడం, ఇతర అంశాలను వాదనల సందర్భంగా వినిపించనున్నట్టు తెలిసింది. కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆగస్ట్ 9న చెప్పిన విషయం విదితమే. కవిత 11 కిలోల బరువు తగ్గిందని, బీపీ పెరగడంతో మాత్రలు మింగాల్సిన పరిస్థితి తన సోదరికి వచ్చిందని ఆమె ఆరోగ్యంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల బెయిల్ రావడంతో కవితకు కూడా బెయిల్ మంజూరు కావొచ్చని బీఆర్ఎస్ శ్రేణులు, ఆమె కుటుంబ సభ్యులు భావించారు. అయితే.. బెయిల్ పిటిషన్ పై విచారణను ఆగస్ట్ 20కి సుప్రీం కోర్టు వాయిదా వేయడంతో కవితకు ప్రస్తుతానికి ఊరట దక్కకుండాపోయింది.