పర్యావరణ రక్షణకు చర్యలేవి?..కేంద్రంపై సుప్రీం ఫైర్

పర్యావరణ రక్షణకు చర్యలేవి?..కేంద్రంపై సుప్రీం ఫైర్
  • పర్యావరణ చట్టాలను కోరల్లేని పాములాగ మార్చారని మండిపాటు

న్యూఢిల్లీ: పొలాల్లో గడ్డి కాల్చివేతలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టాలను కోరల్లేని పాములా మార్చుతున్నదని కేంద్రంపై ఫైర్ అయింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అహ్సనుద్దీన్ అమానుల్లా, అగస్టీన్ జార్జ్ మాసిహ్​తో కూడిన బెంచ్ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై బెంచ్​అసహనం వ్యక్తం చేసింది. ‘‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్​మెంట్ యాక్ట్–2021లోని సెక్షన్ 15 ప్రకారం.. ఉల్లంఘనలకు జరిమానా విధించాలి. కానీ దీనికి కేంద్రం సవరణలు చేయడంతో ఇప్పుడది అమలు కావడం లేదు” అని మండిపడింది. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. 10 రోజుల్లోగా సెక్షన్ 15ను అమలు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ప్రత్యేక అధికారిని నియమించి, చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. 

నామమాత్రపు జరిమానాలు సరిపోవు.. 

పంట వ్యర్థాల కాల్చివేతల విషయంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ సర్కార్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇప్పటి వరకు 44 మందిని విచారించాం. నిబంధనలు ఉల్లంఘించిన 417 మందికి రూ.11 లక్షల జరిమానాలు విధించాం” అని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘మీరు కేవలం నామమాత్రపు జరిమానాలు విధించారు. 

చట్టాన్ని ఉల్లంఘించిన మరో 684 మందికి ఎందుకు ఎలాంటి జరిమానా విధించలేదు?” అని ప్రశ్నించింది. హర్యానా సర్కార్ తరఫు లాయర్ వాదిస్తూ.. ‘‘పంట వ్యర్థాల కాల్చివేతలను నియంత్రించగలిగాం. పోయినేడాది 10 వేలు నమోదైతే.. ఈ ఏడాది కేవలం 400కు పైగా నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించినోళ్ల నుంచి రూ.2 కోట్ల జరిమానాలు వసూలు చేశాం” అని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. 400 చోట్ల గడ్డిని కాల్చివేస్తే, 32 మందిపైనే కేసులు పెట్టారేంటి? అని ప్రశ్నించింది.