ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కేసులో.. రెండు వారాల్లో కౌంటర్ వేయండి

  • భద్రాది కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • విచారణ వచ్చే నెల 3కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్  రేంజ్  ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) సీహెచ్  శ్రీనివాస రావు హత్య  కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్​పై రెండు వారాల్లో కౌంటర్  దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరుడు నవంబరులో పోకలగూడెం ప్లాంటేషన్​లో పశువులను మేపుతున్నారన్న సమాచారంతో అక్కడికెళ్లిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావును గుత్తికోయకు చెందిన మడకం తులా, పొడియం నంగాలు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. 

దీంతో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ బెయిలు కోసం నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను ఈ ఏడాది మే 29న విచారించిన సుప్రీం బెంచ్.. ఈ హత్య కేసులో తెలంగాణ సర్కారు తమ వైఖరి తెలపాలని నోటీసులు జారీ చేసింది. కాగా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్​తో కూడిన బెంచ్  ముందు ఈ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ కౌంటర్ దాఖలుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని బెంచ్​కు విజ్ఞప్తి చేశారు. అయితే, రెండు వారాల్లోనే కౌంటర్  దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.