కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు ఆపండి: సుప్రీంకోర్టు

కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు ఆపండి: సుప్రీంకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • తదుపరి ఆర్డర్స్​ ఇచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దు
  • అటవీ ప్రాంతం కాకపోయినా.. చెట్లను నరికేయడానికి పర్మిషన్​ తీసుకున్నరా?
  • మూడ్రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడం ఏమిటి?
  • నెలరోజుల్లో ఎక్స్​పర్ట్స్ కమిటీ వేసి, ఆరు నెలల్లో రిపోర్ట్​ ఇవ్వండి
  • లొకేషన్​ను సీఎస్​ విజిట్ చేసి ఈ నెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి
  • నిర్లక్ష్యంగా ఉంటే సీఎస్​ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిక

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​లోని కంచ గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి, ఆరు నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని పేర్కొంది. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని, ఈ నెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే.. సీఎస్  వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. 

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుమోటో రిట్ పిటిషన్​ గురువారం ఉదయం 11 గంటలకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మాసిహ్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ భూములను ప్రభుత్వం చదును చేస్తూ.. చెట్లను నరికివేస్తున్నదని, అక్కడ నెమళ్లు, జింకలు విలవిలలాడుతున్నాయని కోర్టుకు అమికస్ క్యూరీ పరమేశ్వర్ నివేదించారు. మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. ఈ విషయంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపడ్తామని, కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి 3.30 గంటలలోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశించింది. ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్​ అభిషేక్ మనుసింఘ్వీ బెంచ్ దృష్టికి తెచ్చారు. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం బదులిస్తూ.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని పేర్కొంది.  

అది అటవీ ప్రాంతం కాదన్న  ప్రభుత్వ అడ్వకేట్​

హైకోర్టు రిజిస్ట్రార్​ (జ్యుడీషియల్​) నుంచి మధ్యంతర నివేదిక రావడంతో మధ్యాహ్నం 3.48 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు సీనియర్ అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతం అటవీ ప్రాంతం కాదన్నారు. 30 ఏండ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని తెలిపారు. అటవీ భూమి అని ఆధారాలు లేవని తెలిపారు. ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది. ‘‘అటవీ ప్రాంతం కాకపోయినా.. చెట్లను నరికేయడానికి అనుమతి తీసుకున్నరా?  రెండు మూడు రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్ల నరికివేత ఏమిటి? ఇది తీవ్రమైన విషయం. ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా.. చట్టానికి అతీతం కాదు’’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై ఇప్పటికీ దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతున్నదని గుర్తుచేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని.. వారి తరఫు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణ్  ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

అంత అత్యవసరం ఏమొచ్చింది? 

హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) నివేదికలో పొందుపరిచిన చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసి, భారీ యంత్రాలను ఉపయోగించి వందలాది ఎకరాల విస్తీర్ణాన్ని అస్తవ్యస్తం చేశారు. దీనివల్ల నెమళ్లు, జింకలు ఈ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించే చిత్రాలు రిజిస్ట్రార్ నివేదికలో ఉన్నాయి. దీనికి తోడు అక్కడ ఒక చెరువు కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నివేదిక, చిత్రాల ప్రాథమిక పరిశీలన ప్రకారం.. ఈ ప్రాంతం అడవి జంతువులు నివసించేందుకు అనువుగా ఉంది’’ అని వ్యాఖ్యా నించింది. 

అటవీ భూములు గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేయకపోతే సీఎస్​లు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని మార్చి 4న  సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొన్నట్లు ధర్మాసనం గుర్తుచేసింది. అటవీ భూమి గుర్తించడానికి మార్చి 15న రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ ఇంకా అటవీ భూములను గుర్తించే పనులను ప్రారంభి చకముందే అంత అత్యవసరంగా కంచ గచ్చిబౌలిలో చెట్లను నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ ఏరియాలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో అండర్ రూల్స్ 61 ఆఫ్ 1923 లోబడి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, ఆరు నెలల్లో ఈ కమిటీ రిపోర్ట్ సమర్పించాలని ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.

సీఎస్​ జైలుకు వెళ్లాల్సి వస్తది

కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి, ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో అమికస్ క్యూరీ పరమేశ్వర్ ప్రస్తావించిన పలు అంశాలపై సమాధానాలు ఇవ్వాలని పేర్కొంది. ‘‘ఆ భూముల్లో చెట్లను తొలగించడం వంటి కార్యకలాపాలను చేపట్టాల్సిన అవసరం ఏమిటి? ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి పొందిందా? చెట్ల నరికివేత కోసం ఫారెస్ట్ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు, మరేదైనా స్థానిక చట్టాల ద్వారా పర్మిషన్ తీసుకున్నరా? మార్చి 15 న అటవీ భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో పలవురు అధికారులను చేర్చడానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి” అని సీఎస్​ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉంటే సీఎస్  జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.