న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రూపొందించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 4 ఆంక్షలు మరో మూడు రోజుల పాటు అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 371కి చేరుకున్న నేపథ్యంలో జీఆర్ఏపీ 4 ఆంక్షలు ఆదివారం వరకు అమలవుతాయని స్పష్టం చేసింది. గాలిలో నాణ్యత రోజురోజుకూ పడిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ తీరుపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టైన్ జార్జ్ మాసిహ్ తో కూడిన బెంచ్ సీరియస్ అయింది.
భారీ వాహనాలపై నిషేధం ఉన్నా.. అలాంటి వెహికల్స్ యథేచ్చగా తిరగడంపై బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు సిటీ పరిధిలోని 113 ఎంట్రీ పాయింట్ల వద్ద తప్పనిసరిగా నిఘా వేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఆర్ఏపీ 4 ఆంక్షలను సులభతరం చేయడానికి అవకాశం ఉందో లేదో ఈ నెల 25న నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. జీఆర్ఏపీ 4 అమలు తీరుపై నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని బెంచ్ మందలించింది. జీఆర్ఏపీ 4 ఆంక్షలను సిటీలోని 13 మెయిన్ ఎంట్రీ పాయింట్ల వద్ద పటిష్టంగా అమలు చేస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలపగా.. కొన్నిచోట్ల మాత్రమే నిఘావేస్తే సరిపోదని, 113 ఎంట్రీ పాయింట్ల వద్దా తప్పనిసరిగా నిఘా పెట్టాలని బెంచ్ స్పష్టం చేసింది.
ఆంక్షల అమలుపై 13 మంది అడ్వొకేట్లతో తనిఖీ
భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పరిశీలించేందుకు 13 మంది సుప్రీంకోర్టు అడ్వొకేట్లను కోర్టు కమిషనర్లుగా సుప్రీంకోర్టు నియమించింది. ఆ 13 మంది ఎంట్రీ పాయింట్లను సందర్శించి ఆంక్షల అమలు తీరును పరిశీలిస్తారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో 113 ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మొత్తం 113 ప్రవేశ మార్గాల్లో 100 ఎంట్రీ పాయింట్ల వద్ద ట్రక్కుల ప్రవేశంపై చెకింగ్‌లు లేవని, వెంటనే అన్ని పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కాగా.. జీఆర్ఏపీ 4 నిబంధనల ప్రకారం ఢిల్లీలో భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంది. ఇక ఈ వారంలో ఢిల్లీలో గాలి నాణ్యత స్టేజ్ 3 (సివియర్ స్టేజ్) కు చేరింది. కాగా.. పంజాబ్, హర్యానాలో రైతులు తమ పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీ, ఎన్సీఆర్ో గాలిలో నాణ్యత రోజురోజుకు పడిపోతున్నదని సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ అధికారులు తెలిపారు.