ముగిసిన జెట్ ఎయిర్‌వేస్ కథ.. ఆస్తుల విక్రయానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

ముగిసిన జెట్ ఎయిర్‌వేస్ కథ.. ఆస్తుల విక్రయానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

ఆర్థికంగా కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసింది. ఈ విమానయాన సంస్థ లిక్విడేషన్‌ ప్రక్రియకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం(నవంబర్ 07) ఆదేశాలిచ్చింది. దివాలా పరిష్కార ప్రయత్నాలు విఫలమవ్వడంతో.. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీజెఐ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

లిక్విడేషన్ అంటే మొత్తం వ్యాపారాలు మూసేసి.. ఆస్తుల విక్రయం చేపట్టాలన్నమాట. తద్వారా రుణదాతలకు, ఉద్యోగులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది. ఆస్తుల విక్రయం కోసం లిక్విడేటర్‌ను నియమించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLT) ముంబై బెంచ్‌ను ఆదేశించింది.

ఏంటి ఈ వివాదం..?

ఆర్థిక కష్టాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ 2019లో తన కార్యకలాపాలు నిలిపివేసింది. దాంతో, నమ్మి రుణమిచ్చిన బ్యాంకులు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (NCLT) ఎదుట దివాలా ప్రక్రియను ప్రారంభించాయి. కొన్ని నెలల ప్రొసీడింగ్‌ల అనంతరం దివాలా ప్రక్రియలో జలాన్-కర్లాక్ కన్సార్షియం(JKC) బిడ్డింగ్‌ ద్వారా జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. కానీ, రుణదాతలు, కన్సార్షియం మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ వ్యవహారం ముందుకు కదలలేదు. 

దాంతో, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని రుణదాతలు మరోసారి ఎన్‌సీఎల్‌ఏటీ (NCLAT)కి వెళ్లారు. కానీ, NCLT వారి అభ్యంతరాలను తోసిపుచ్చింది. 2023 జనవరిలో JKC ద్వారా ఎయిర్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించింది. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(NCLAT) కూడా సమర్థించింది. 90 రోజుల్లో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను పొందాలని JKCని ఆదేశించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టు తలుపుతట్టగా.. వారికి అనుకూలంగా తీర్పొచ్చింది.

విచారణలో సుప్రీంకోర్టు.. జలాన్ కల్రాక్ కన్సార్టియం అవసరమైన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చలేదని గుర్తించింది. ఇందులో ఎయిర్‌లైన్‌కి రూ. 350 కోట్లు ఇంజెక్ట్ చేయడం, రూ. 226 కోట్ల ఉద్యోగుల జీతాలు చెల్లించడం వంటివి ఉన్నాయి. ఈ వ్యవహారంలో సీజెఐ ధర్మాసనం.. నేషనల్ లా ట్రిబ్యునల్ (NCLAT) ఆర్డర్‌ను సైతం పక్కన పెట్టింది. ఉద్యోగుల జీత భత్యాలు, నిధులు వెచ్చించడంలో JKC విఫలమైనందున రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా JKCకి అనుకూలంగా తీర్పు వెలువరించినందుకు NCLATని కూడా కోర్టు మందలించింది.