న్యూఢిల్లీ: దేశ రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పంట పొలాల్లో వరికోతల తర్వాత మిగిలిపోయిన గడ్డిని కాల్చడంతో ఢిల్లీని పొగలు కమ్మేస్తుండటం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ‘‘ఎన్నేండ్లని ఇట్లా చూస్తూ ఊరుకోవాలి? ఏం చేస్తరో తెలియదు. వెంటనే పొలాల్లో గడ్డిని కాల్చడాన్ని ఆపించండి” అంటూ పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలను టాప్ కోర్టు ఆదేశించింది. ఢిల్లీ– నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్)లో గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియాతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది.
కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేసింది. ‘‘క్షమించండి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని హత్య చేయడమే. ఇంతకుమించి చెప్పడానికి వేరే పదాలు లేవు” అంటూ బెంచ్ తీవ్రంగా స్పందించింది.ఢిల్లీ రెండు దశాబ్దాలుగా ఏటా ఇలా పొల్యూషన్ బారిన పడుతుంటే.. పొలాల్లో గడ్డిని తగలబెట్టకుండా ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.
ఎస్ హెచ్ఓ, సీఎస్ లే బాధ్యులు..
విచారణ సందర్భంగా పంజాబ్ తరఫు అడ్వకేట్ స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో గతేడాది నుంచి పంట వ్యర్థాలను కాల్చడం 40% వరకూ తగ్గిందని చెప్పారు. దీంతో బెంచ్ స్పందిస్తూ.. ‘‘ఇదంతా ఆగాలని మేం కోరుకుంటున్నాం. ఎలా చేయాలన్నది మీ బాధ్యత. రైతులు గడ్డిని కాల్చకుండా బలవంతంగా ఆపుతారా? ప్రోత్సాహకాలు ఇస్తారా? లేదా ఇతర చర్యలు తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. కానీ ఇది మాత్రం ఆగాలి” అని తేల్చిచెప్పింది. పొలాల్లో గడ్డిని కాల్చకుండా అడ్డుకునే బాధ్యత స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)దేనని చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో దీనిపై ఓవరాల్ గా చీఫ్ సెక్రటరీలు పర్యవేక్షించాలని బెంచ్ ఆదేశించింది. పంట పొలాల్లో గడ్డిని కాల్చడం ఒక్కటే ఢిల్లీ కాలుష్యానికి కారణమని తాము చెప్పడంలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కొంచెం తగ్గిన పొల్యూషన్
ఢిల్లీలో గాలి కాలుష్యం మంగళవారం కొంచెం తగ్గింది. ఎయిర్ క్వాలిటీ కాస్తంత మెరుగుపడి ‘సివియర్’ నుంచి ‘వెరీ పూర్’ కేటగిరీకి మారింది. సోమవారం సాయంత్రం ఏక్యూఐ 421గా నమోదు కాగా, మంగళవారానికి 394కు తగ్గింది. గాలిలో పీఎం 2.5 కాలుష్య కణాలు ఒక క్యూబిక్ మీటర్ కు 60 మైక్రోగ్రాములు ఉంటే సేఫ్ లిమిట్ గా కాగా.. ప్రస్తుతం ఢిల్లీ గాలిలో సేఫ్ లిమిట్ కన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా పీఎం 2.5 కణాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ లిమిట్ 15 మైక్రోగ్రాముల కన్నా ఇది 30 నుంచి 40 రెట్లు ఎక్కువని తెలిపారు. కాగా, హర్యానా, రాజస్థాన్, యూపీలోని పలు సిటీల్లో కూడా కాలుష్యం పెరిగింది. నోయిడాలో ఈ నెల 10 వరకూ 9వ క్లాస్ లోపు స్టూడెంట్లకు ఫిజికల్ క్లాసులు రద్దు చేశారు.
లోకల్ పొల్యూషనే ఎక్కువ
ఢిల్లీలో గాలి విషతుల్యంగా మారడానికి గడ్డిని కాల్చడం ఒక్కటే కారణం కాదని.. లోకల్‌గా వాహనాలు, ఇండస్ట్రీల నుంచి విడుదలయ్యే కాలుష్యం పాత్రే ఎక్కువని ఓ స్టడీలో తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఈడీ అనుమితారాయ్ చౌధురి మాట్లాడుతూ.. ‘ఈ నెల 2న ఢిల్లీ, ఎన్సీఆర్లోని గాలిలో పీఎం 2.5 కణా లు 24 గంటల్లో 68% మేర పెరిగాయి.
గత ఐదారు రోజుల్లో పొలాల్లో గడ్డిని కాల్చడం వల్ల గాలిలో పీఎం 2.5 కణాలు 25 నుంచి 35% మాత్రమే పెరిగాయని తేలింది. దీనిని బట్టి చూస్తే ఢిల్లీలో గాలి కాలుష్యానికి లోకల్ అంశా లే కారణమని తెలుస్తోంది” అని ఆమె చెప్పారు.