మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఏజీ పెరారివాలన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతడిని విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ జైలు జీవితానికి గుడ్ బై చెప్పనున్నారు. రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు.
ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19ఏళ్లు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి ఏడాది సుప్రీం కోర్టు కూడా ఆ శిక్షతో ఏకీభవించింది. ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలలో జాప్యం కావడంతో తనను త్వరగా విడుదల చేయాలని పెరారివాలన్ విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం మాత్రం అతడి అభ్యర్థనను వ్యతిరేకించింది. కాగా తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ దృష్టికి తీసుకెళ్లిన కేసులో మాత్రం కదలిక రాలేదు. దీంతో గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Supreme Court orders release of AG Perarivalan, one of the convicts serving life imprisonment in connection with the assassination of former Prime Minister Rajiv Gandhi.
— ANI (@ANI) May 18, 2022
రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది.