
- వామన రావు దంపతుల కేసులో సుప్రీంకోర్టు వెల్లడి
- ఈ కేసులో ఆధారాలు సమర్పించాలని రాష్ట్ర సర్కార్‌కు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు వామన రావు, నాగమణి హత్య కేసులో అన్ని రికార్డులు, వీడియోలతో సహా ఒరిజినల్ డాక్యుమెంట్లు తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ రికార్డులు, వీడియోలు పరిశీలించాకే ఈ హత్య కేసును సీబీఐ విచారణ జరపాలా వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న న్యాయవాది గట్టు వామనరావు దంపతులు హత్యకు గురయ్యారు.
ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పుట్ట మధుకర్ ప్రమేయంతోనే హత్య జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు, ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, వాస్తవ ఆధారాలను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని పుట్టమధు సైతం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
అయితే, కేసు విచారణను సీబీఐకి అప్పగించడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశిస్తే విచారణకు తాము కూడా సిద్ధమేనని సీబీఐ సైతం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి వీడియోలు, రికార్డులు, డాక్యుమెంట్స్ అన్నీ మూడు వారాల్లో కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.