న్యూఢిల్లీ: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధతతోసహా పలు డిమాండ్లతో పంజాబ్ రైతుల తరఫున నిరాహార దీక్షకు దిగిన సంయుక్త కిసాన్ మోర్చా(నాన్‌పొలిటికల్) కన్వీనర్ జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌ను సుప్రీంకోర్టు ప్యానెల్ కలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన జస్టిస్ (రిటైర్డ్) నవాబ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ సోమవారం మధ్యాహ్నం దల్లేవాల్‌ను కలిసి, వెంటనే వైద్య సహాయం పొందాలని అభ్యర్థించింది.
అనంతరం జస్టిస్ నవాబ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. దల్లేవాల్ ఆరోగ్యంగా ఉండాలని తాము వాహేగురును ప్రార్థించినట్టు చెప్పారు. వైద్య సహాయం పొందడానికి దల్లేవాల్ అంగీకరించారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మేమందరం ఆయనను అభ్యర్థించాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని సమాధానమిచ్చారు.
ఈ ఆందోళనలు ముగిసిపోవాలని చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చామని దల్లేవాల్‌కు చెప్పామని, ఆయన ఆరోగ్యం బాగుండాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపామని అన్నారు. అయితే, తనకు వ్యవసాయమే ఫస్ట్ అని, ఆ తర్వాతే ఆరోగ్యం అని దల్లేవాల్ అన్నారని జస్టిస్ నవాబ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆందోళనకు ముగింపు పలుకుతామనే విశ్వాసంతోనే సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ ఈ కమిటీని నియమించారని చెప్పారు.