- మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
- స్టేటస్ రిపోర్టు తమకే అందజేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశం
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈశా ఫౌండేషన్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని, ఫౌండేషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తన ఇద్దరు బిడ్డలను కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ లో బంధించారని, తమను వాళ్లతో మాట్లాడనివ్వడం లేదని రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తు చేపట్టి, దానికి సంబంధించిన అన్ని వివరాలను తమకు అందజేయాలని ఆదేశాలిచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రొహత్గీ వాదనలు వినిపిస్తూ.. 150 మంది పోలీసులు ఫౌండేషన్ ఆశ్రమంలోకి వచ్చారని, అణువణువూ గాలిస్తున్నారని చెప్పారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘ఆశ్రమంలోకి ఆర్మీని లేదా పోలీసులను అనుమతించలేరు’ అని పేర్కొంది.
వాళ్లు స్వచ్ఛందంగానే ఆశ్రమంలో ఉంటున్నరు..
విచారణ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సుప్రీం బెంచ్ వర్చువల్ గా మాట్లాడింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ స్వచ్ఛందంగానే ఆశ్రమంలో ఉంటున్నట్టు తమకు వెల్లడించారని బెంచ్ తెలిపింది. ‘‘వాళ్లకు 24, 27 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఆశ్రమంలో చేరామని తెలిపారు. ఇప్పుడు వాళ్ల వయసు 39, 42 ఏండ్లు. వాళ్లిద్దరూ ఇష్ట ప్రకారమే ఆశ్రమంలో ఉంటున్నామని చెప్పారు.
అవసరమైనప్పుడు బయటకు వెళ్తున్నామని, తమ తల్లిదండ్రులను కలుస్తున్నామని వెల్లడించారు. ఇద్దరిలో ఒకామె హైదరాబాద్ లో జరిగిన మారథాన్ లో పాల్గొన్నట్టు కూడా చెప్పింది” అని బెంచ్ వెల్లడించింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. వెంటనే దర్యాప్తును నిలిపివేయాలని, స్టేటస్ రిపోర్టును తమకే అందజేయాలని పోలీసులను ఆదేశించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ ను తమ కోర్టుకు బదిలీ చేసుకుంటున్నామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.