గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల నియామకంపై విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తుదివాదనలు ఫిబ్రవరి 12న వింటామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ రోజుకు విచారణను వాయిదా వేసింది. గత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ నాటి రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌‌‌‌కు సిఫారసు చేసింది. అప్పటి గవర్నర్‌‌‌‌ తమిళిసై ఆ సిఫారసులను తిరస్కరిస్తూ.. గతేడాది సెప్టెంబర్‌‌‌‌ 19న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను దాసోజు శ్రవణ్‌‌‌‌, కుర్రా సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది. 

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మంత్రివర్గం జనవరి 13న కోదండరాం, ఆమీర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ను గవర్నర్‌‌‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు గవర్నర్‌‌‌‌  ఆమోదించడంతో జనవరి 27న గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ అయింది. దీనిపై మరోసారి దాసోజు శ్రవణ్‌‌‌‌, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

 అనంతరం హైకోర్టు తీర్పుకు తగ్గట్టు ఎమ్మెల్సీ అభ్యర్థులగా కోదండరాం, అలీఖాన్​ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేసింది. దీంతో ఆగస్టు 4న తమకు న్యాయం చేయాలని కోరుతూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన బెంచ్ విచారించింది.