వరకట్న చట్టం లెక్కనే మనీలాండరింగ్ చట్టం దుర్వినియోగం:సుప్రీంకోర్టు

వరకట్న చట్టం లెక్కనే మనీలాండరింగ్ చట్టం దుర్వినియోగం:సుప్రీంకోర్టు
  • ఈడీ తీరుపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు
  • నిందితులను జైల్లో ఉంచేందుకు ఈ చట్టాన్ని వాడుకుంటోందని కామెంట్
  • 498ఏ కేసుల్లో జరిగినట్టే పీఎంఎల్ఏ కేసుల్లోనూ జరుగుతున్నదని వ్యాఖ్య
  • చత్తీస్ గఢ్ లిక్కర్ స్కామ్ నిందితుడు అరుణ్ త్రిపాఠికి బెయిల్ మంజూరు 

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను జైల్లో ఉంచేందుకు ఈ చట్టాన్ని ఈడీ ఉపయోగించుకుంటున్నదని ఫైర్ అయింది. వరకట్న వేధింపుల చట్టంలాగే మనీలాండరింగ్ నిరోధక చట్టం కూడా దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చత్తీస్ గఢ్​కు చెందిన మాజీ ఎక్సైజ్ ఆఫీసర్ అరుణ్ త్రిపాఠి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ కామెంట్లు చేసింది. రాష్ట్ర ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో అరుణ్ త్రిపాఠిపై రాయ్ పూర్ లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. 2023లో ఆయనను అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో చత్తీస్ గఢ్ హైకోర్టు బెయిల్ నిరాకరించగా, దాన్ని సవాల్ చేస్తూ అరుణ్ త్రిపాఠి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్​తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగ్నిజెన్స్ ఆర్డర్​ను హైకోర్టు రద్దు చేసినప్పటికీ, నిందితుడిని జైల్లోనే ఉంచడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఒక వ్యక్తిని ఎప్పటికీ జైల్లోనే ఉంచాలనేది మనీలాండరింగ్ చట్టం ఉద్దేశం కాదు. కాగ్నిజెన్స్ ఆర్డర్ ను హైకోర్టు రద్దు చేసినప్పటికీ, నిందితుడిని జైల్లోనే ఉంచితే ఏమనాలి? 498ఏ కేసుల్లో ఏం జరుగుతున్నదో చూడండి. వాటిలాగే మనీలాండరింగ్ చట్టం కూడా దుర్వినియోగం అవుతున్నదా?” అని ప్రశ్నించింది. నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ వాదనలను తోసిపుచ్చుతూ.. అరుణ్ త్రిపాఠికి బెయిల్ మంజూరు చేసింది. 

గతంలోనూ ఈడీ తీరుపై కామెంట్లు.. 

గతంలోనూ చాలాసార్లు ఈడీ విచారణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేను పొద్దున నుంచి అర్ధరాత్రి వరకు 15 గంటలకు పైగా విచారించడంపై ఫైర్ అయింది. ఇది అమానవీయమని పేర్కొంది. మరో కేసులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ను ఆగమేఘాల మీద అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. టెర్రరిజం, ఇతర తీవ్రమైన నేరాల్లో ఇంత తొందరగా ఎందుకు స్పందించడంలేదని నిలదీసింది. పీఎల్ఎంఏ కేసుల్లో కన్విక్షన్ రేటు తక్కువగా ఉంటున్నదని.. విచారణ సరిగా చేయాలని, సాక్ష్యాధారాలపై దృష్టిసారించాలని ఈడీకి సుప్రీం గతంలో సూచించింది. ఇక ఓ రెండు సందర్భాల్లో బాంబే హైకోర్టు కూడా ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిద్ర అనేది మనిషికి ప్రాథమిక అవసరమని, నిందితుల వాంగ్మూలాలను అర్ధరాత్రి వరకు రికార్డు చేయడమంటే ఆ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈడీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నదని, ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నదని మరో కేసు విచారణ సందర్భంగా కామెంట్ చేసింది.