మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది: సుప్రీంకోర్టు

మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: చైల్డ్‌‌ పోర్నోగ్రఫీ చూడటం, వాటిని డౌన్​లోడ్ చేయడం కూడా నేరమే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పోక్సో, ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులు అని స్పష్టం చేసింది. పోక్సో చట్టంలో ‘చైల్డ్‌‌ పోర్నోగ్రఫీ’ అనే పదాన్ని ‘చైల్డ్‌‌ సెక్సువల్‌‌ ఎక్స్‌‌ప్లాయిటేటివ్‌‌ అండ్‌‌ అబ్యూసివ్‌‌ మెటీరియల్‌‌’ (సీఎస్​ఈఏఎం)గా మార్చాలని పార్లమెంట్​కు సూచించింది. పోక్సో చట్టంలో సవరణలు చేయాలని తెలిపింది. సుప్రీం కోర్టు సూచించిన సవరణలు అమల్లోకి వచ్చేదాకా దీనిపై ఆర్డినెన్స్‌‌ జారీ చేసుకోవచ్చని చెప్పింది. ఇకపై కోర్టుల్లో ‘చైల్డ్‌‌ పోర్నోగ్రఫీ’ అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్​లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, దాని చట్టపరమైన పరిణామాలపై గైడ్​లైన్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనంలోని జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కలిగి ఉండటం కూడా నేరమే అని తెలిపారు.

మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది

చైల్డ్‌‌ పోర్నోగ్రఫీ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన తీర్పుతో ఘోరమైన తప్పిదం చేసిందని తాము నిర్ధారణకు వచ్చామని తెలిపింది. ‘‘మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఉత్తర్వులను పక్కన పెట్టడం, పునరుద్ధరించడం తప్ప మా వద్ద వేరే మార్గం లేదు’’అని బెంచ్ తెలిపింది.

వీడియోలు షేర్ చేస్తే ఐదేండ్ల జైలు

జస్టిస్ జేబీ పార్ధివాలా 200 పేజీల తీర్పు రాశారు. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకు.. సీజేఐకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా.. వీడియోలతో దొరికినా విధించే జరిమానాల గురించి జస్టిస్ పార్దివాలా వివరించారు. ‘‘పిల్లలకి సంబంధించిన ఏదైనా పోర్న్ వీడియోలను మొబైల్ ఫోన్‌‌లో డౌన్‌‌లోడ్ చేసి స్టోర్ చేసిన వ్యక్తికి రూ.5 వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. అతనే మళ్లీ తప్పు చేస్తే రూ.10 వేలకు తక్కువ కాకుండా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటది. వీడియోలను ఎవరికైనా షేర్ చేయడానికి డౌన్‌‌లోడ్ చేసినట్టు తేలితే జరిమానాతో పాటు, మూడు నుంచి ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తాం. వీడియోలతో బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఏడేండ్ల జైలు, జరిమానా చెల్లించాల్సి ఉంటది’’అని జస్టిస్ జేబీ పార్ధివాలా తీర్పు రాశారు.

అసలు కేసు ఏంటి?

చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 ఏండ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కింది కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్.. సదరు యువకుడిపై క్రిమినల్‌‌ చర్యలను నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరి 11న ఆదేశాలిచ్చారు. ‘‘యువకుడు కేవలం వీడియోలు చూశాడు. ఇతరులకు పంపలేదు. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. చైల్డ్‌‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదు. ఇలాంటి కేసుల్లో పోర్నోగ్రఫీకి అలవాటుపడిన వారిని శిక్షించే బదులు.. వారికి సరైన మార్గం చూపడం ముఖ్యం’’అని తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్జీవోలు సుప్రీం కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చుతూ.. సదరు యువకుడిపై క్రిమినల్‌‌ చర్యలను పునరుద్ధరించింది.