ఢిల్లీ: గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
గ్రూప్-1 పరీక్ష నిలిపివేయాలని స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్కు కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషన్లరకు సుప్రీం కోర్టు సూచించింది. గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది.
సుప్రీం కోర్టు తీర్పుతో గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ (అక్టోబర్ 21, 2024) మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్-1 పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నెల 27 వరకు (అక్టోబర్ 27, 2024) కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు 31,383 మంది హాజరు కానుండగా, వారి కోసం 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 సెంటర్లున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.
తొలి రోజు సోమవారం క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఉంటుంది. ఆ తర్వాత వరుసగా ఆరు వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఆరు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ర్యాంకింగ్ ఫైనల్ అవుతుంది. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. అయితే, ఇంగ్లిష్ పేపర్ మినహా మిగిలిన అన్ని పేపర్లను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది.
అభ్యర్థులు ఎంచుకున్న మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. కొన్ని పేపర్లు ఒక మీడియంలో రాసి, మరికొన్ని వేరే మీడియంలో రాస్తే ఆ అభ్యర్థిని ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోబోమని టీజీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. ఒకే జవాబు పత్రంలో సగం ఒక మీడియంలో, మరికొంత మరో మీడియంలో రాసినా అది చెల్లుబాటు కాదని స్పష్టత ఇచ్చింది.