
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వచ్చే నెల మార్చి 3న ఈ పిటిషన్లపై వాదనలు వింటామని తేల్చి చెప్పింది.బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చిరిన ఎమ్మెల్యేలు పోచారం, ఎం.సంజయ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ రిట్ పిటిషన్ (సివిల్) వేసింది.
మ్మెల్యేలు దానం, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిపైనా చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ వేర్వేరుగా రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి సుప్రీంకోర్టు విచారణ జాబితాలో లిస్ట్ అయినా... పలు కారణాల వల్ల బెంచ్ కూర్చోలేదు. దీంతో పిటిషనర్ల తరపు అడ్వొకేట్ గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గి అందుబాటులో లేకపోవడంతో కేసును వచ్చే నెల 3న విచారిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.