రాజీవ్ హంతకులను విడుదల చేయండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దోషులకు తమిళనాడు ప్రభుత్వం క్షమాభిక్ష(రెమిషన్)కు సిఫారసు చేసినందున వారిని రిలీజ్ చేయాలని శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెప్పింది. రాజీవ్ హత్య కేసులో ఇంతకుముందే రెమిషన్ పై విడుదలైన ఏజీ పేరరివాళన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే మిగతా ఆరుగురు దోషులకూ వర్తిస్తుందని స్పష్టంచేసింది. కేసులోని మిగతా దోషులు నళిని శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్, శంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, జయకుమార్ లను కూడా రిలీజ్ చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఈ కేసులో దోషులందరూ తమ నేరానికి సంబంధించి శిక్షను అనుభవించారు. అందుకే పేరరివాళన్​తో సమానంగా మిగతా దోషులందరికీ క్షమాభిక్షను వర్తింపచేయాలి. వెంటనే రిలీజ్ చేయాలి” అని కోర్టు ఆదేశించింది. 

ఆరుగురికీ విముక్తి  

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికారాలను వినియోగిస్తూ ఈ ఏడాది మే 18న పేరరివాళన్ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 302 కింద దోషిగా తేలిన వాళ్లకు క్షమాభిక్ష విషయంలో రాష్ట్ర కేబినెట్ సలహా మేరకే గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుందని ఆ సందర్భంగా కోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఈ కేసులో అప్పటికే 30 ఏండ్లు జైలు శిక్షను పూర్తి చేసుకున్న పేరరివాళన్ విడుదలయ్యారు. 

ఇదీ కేసు..

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్​లో 1991, మే 21న ఎన్నికల ర్యాలీ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ధను అనే మహిళ బెల్టు బాంబును పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. బాంబు పేలుడులో రాజీవ్ తో పాటు 9 మంది పోలీసులు, ఆరుగురు పౌరులు చనిపోయారు. ఈ కేసులో 41 మందిపై చార్జ్ షీట్ దాఖలు కాగా, 26 మందిని ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చింది. అందరికీ మరణశిక్షను విధించింది. అయితే, నళిని, టి. శంతన్ అలియాస్ సుథాంథిరరాజ్, శ్రీహరన్, ఆరివు అలియాస్ జి పేరరివాళన్​ల మరణశిక్షను మాత్రమే సుప్రీంకోర్టు సమర్థించింది.

తీర్పు దురదృష్టకరం: కాంగ్రెస్ 

రాజీవ్ హంతకులను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇది ఆమోదయోగ్యం కాదని, కోర్టు తీర్పు తప్పు అని అభిప్రాయపడింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కోర్టు తీర్పు దురదృష్టకరం. దేశ ప్రజల భావనతో సంబంధం లేకుండా కోర్టు నిర్ణయం తీసుకుంది” అని అందులో పేర్కొన్నారు.

ఇది మా గెలుపే: అన్నా డీఎంకే 

రాజీవ్ హంతకులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్నాడీఎంకే పార్టీ హర్షం వ్యక్తంచేసింది. తమ పార్టీ హయాంలో న్యాయపరంగా తీసుకున్న కీలక చర్యల ఫలితంగానే ఇప్పుడు వారికి విముక్తి లభించిందని ఆ పార్టీ సీనియర్ నేత డి. జయకుమార్ అన్నారు. తాము కృషి చేస్తే.. డీఎంకే ప్రభుత్వం తమ ఘనతేనని చెప్పుకొంటోందని ఆయన విమర్శించారు.  

చరిత్రాత్మకమైన తీర్పు: స్టాలిన్

రాజీవ్ హత్య కేసులో దోషుల విడుదలకు ఆదేశాలతో సుప్రీంకోర్టు గవర్నర్ పరిధిని తెలియజేసిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ మూలన పడేయరాదన్న విషయం ఈ తీర్పుతో తేలిపోయిందన్నారు. మూలన పడిన ప్రజాస్వామ్య సూత్రాలను తిరిగి అమలులోకి తెచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకమని హర్షం వ్యక్తం చేశారు.

బాధితులకేదీ న్యాయం?  

రాజీవ్ హత్య సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో మరణించిన వాళ్లు, గాయపడి, బాధితులుగా మిగిలినవాళ్లకు న్యాయం సంగతి ఏమిటంటూ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనసూయ డైసీ ఎర్నెస్ట్ ప్రశ్నించారు. శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ హత్య జరిగిన చోటే ఆమె డ్యూటీ చేశారు. ‘‘అప్పుడు అయిన పెల్లెట్ గాయాలకు ఇప్పటికీ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నా. ఆ బాంబు పేలుడులో గాయపడిన వాళ్లు ఇప్పటికీ ఇలాంటి దుస్థితిలోనే ఉన్నారు. మరి మృతులు, బాధితులకు న్యాయం ఎక్కడ జరిగింది? టెర్రరిస్టులను సాధారణ క్రిమినల్స్ లా చూడొద్దు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.