న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జ్‌షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్ ముకుల్ రోహత్గి తెలిపారు. చార్జ్‌షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. 2023, నవంబర్‌లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, బెయిల్‌ను రద్దు చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ బుధవారం ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని జర్నలిస్టు ఇంప్లీడ్ పిటిషన్ వేయగా, దాన్ని కొట్టివేస్తూ జర్నలిస్టుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఈ కేసుకు మీకు సంబంధం ఏంటి? మీరెందుకు ఇందులో జోక్యం చేసుకున్నారు?’’అని జర్నలిస్టును కోర్టు మందలించింది.