
- ముగిసిన వాదనలు.. 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
- ఈ అంశంపై మాట్లాడేటప్పుడు సీఎం సంయమనం పాటించాలని సూచన
- లేదంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందన్న బెంచ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ తరఫున సీనియర్ అడ్వకేట్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గురువారం అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు.
అసెంబ్లీ గడువు ముగియాలా?
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి సింగిల్ బెంచ్ కేవలం 4 వారాల టైం ఇచ్చిన విషయాన్ని విస్మరించవద్దని జస్టిస్ బీర్ గవాయి అన్నారు. ఇందుకు సింఘ్వీ బదులిస్తూ..‘పదో షెడ్యూల్ కింద స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు జోక్యం చేసుకోలేదు’ అని వాదించారు. మధ్యలో బీఆర్‌ఎస్ తరుఫున అడ్వకేట్ ఆర్యమ సుందరం కలుగజేసుకొని.. ‘‘కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాలేదు.
ఇంతవరకు స్పీకర్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఇలా వాళ్లు చెప్పినట్లు వింటే నాలుగేండ్ల సమయం అయిపోతుందేమో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. కేవలం అధికారం మాత్రమే కాదు.. పూర్తి న్యాయం చేసే బాధ్యత కూడా కోర్టులపై ఉంది. 2024 సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్ 4 వారాల్లో షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్‌ను ఆదేశించింది’’ అని పేర్కొన్నారు.
అయితే ‘సహేతుకత సమయం’లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మరోసారి అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తుండగా.. ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ‘‘ఇప్పటికే 14 నెలలు గడిచింది. ఇంకా 6 నెలలు సమయం కావాలని అడుగుతున్నారు. అంటే 2028 జనవరి లేదా ఫిబ్రవరి ఎన్నికలు వచ్చే వరకు ఉండాల్సిందే అంటారా? అసెంబ్లీ పదవీ కాలం ముగియడమేనా మీ దృష్టిలో ఉన్న రీజనబుల్ టైం’’ అని అడిగారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని న్యాయవాదులు మర్చిపోతే ఎలా అంటూ చురకలు అంటించారు. వాదనలు ముగించిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. లేదంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఫిరాయింపులపై ఇటీవల అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది మరోసారి బెంచ్ దృష్టికి తెచ్చారు. ‘‘బై ఎలక్షన్స్ రావు.. స్పీకర్ తరఫున కూడా చెబుతున్నా’’ అంటూ సీఎం అన్నారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు.
స్పీకర్ తలపై గన్ పెట్టి నిర్ణయం తీసుకోమనలేం: సింఘ్వీ
ఈ వ్యవహారంలో స్పీకర్, స్పీకర్ ఆఫీసు స్పందించేందుకు మరికొంత సమయం కావాలని బెంచ్‌ను అడ్వకేట్అభిషేక్ మనుసింఘ్వీ అభ్యర్థించారు. ‘సహేతుకమైన కాలం’ అనేది స్పీకర్ నిర్ణయించాలని, 6 నెలల సమయం సరిపోతుందని తెలిపారు. ఈ విజ్ఞప్తిని బెంచ్ తోసిపుచ్చింది. ‘‘సింఘ్వీ జీ.. ఇంకా సమయమా? అసలు మీ దృష్టిలో రీజనబుల్ సమయం అంటే ఎంతో ఇప్పటికైనా చెబుతారా? ఇంకా 6 నెలలు ఎలా అడుగుతున్నారు’’ అని వ్యాఖ్యానిం చింది.
ఇందుకు సింఘ్వీ బదులిస్తూ.. స్పీకర్‌పై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదని, ‘స్పీకర్ తలపై తుపాకీ పెట్టి నిర్ణయం తీసుకోమనలేం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టుపై ఉందనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు.