ప్రభుత్వాలు అక్షయ పాత్రను ప్రోత్సహించాలి: సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ

ప్రభుత్వాలు అక్షయ పాత్రను ప్రోత్సహించాలి: సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ

సంగారెడ్డి, వెలుగు: నిస్వార్థంగా సేవ చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు రిటైర్డ్​ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు పోషకాహార లోపాలు తగ్గించేలా పౌష్టికాహారాన్ని అందిస్తున్న అక్షయపాత్ర సేవలను ఆయన కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర మెగా కిచెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు రైస్ మిషన్లను బుధవారం ఎన్.వి.రమణ ప్రారంభించారు. మెగా కిచెన్‌లో వండే విధానాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రమణ మాట్లాడుతూ.. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలను అభినందించారు. హరిత విప్లవం మన సాగు భూముల ఉత్పాదకతను పెంపొందించినప్పటికీ, యువతరంలో పోషకాహార లోపాలు వస్తూనే ఉన్నాయన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటి లాభాపేక్షలేని సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. మిషనరీలు, దాతలు, అంకితభావంతో పనిచేసే సిబ్బంది, వsలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మధు పండిత్ దాసుల మాట్లాడుతూ తెలంగాణలో పదిహేనేండ్లుగా సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఇది సామూహిక సంకల్ప శక్తికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ ట్రస్టీ, ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్, స్కూళ్ల స్టూడెంట్లు, టీచర్లు పాల్గొన్నారు.