- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కన్నా నయీమే బెటర్ : పాశం యాదగిరి
- ‘పదేళ్ల తెలంగాణ–ప్రజల ఆకాంక్షలు, -కర్తవ్యాలు’
హనుమకొండ, వెలుగు : తెలంగాణ అస్థిత్వం కోసం సాయుధ రైతాంగ పోరాటం జరిగితే.. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అస్థిత్వాన్నే నాశనం చేసేశారని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ అస్థిత్వం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాటం జరిగింది తప్ప.. భూములు, ఆస్తుల కోసం కాదన్నారు. శనివారం హనుమకొండ హరిత హోటల్ లో ‘పదేళ్ల తెలంగాణ–ప్రజల ఆకాంక్షలు, -కర్తవ్యాలు’ అనే అంశంపై తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు జేఏసీ కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణతో కలిసి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అస్థిత్వం, ఆత్మగౌరవం గురించి మాట్లాడకుండా సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడటం, పాలకులు కూడా వాటినే గొప్పగా చెప్పుకోవడం అలవాటైందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రజల బతుకుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ రాష్ట్ర రాజధాని చుట్టూ లేనన్ని భూములు హైదరాబాద్ చుట్టూరా ఉన్నాయని, రాష్ట్రం ఏర్పడ్డాక అధికార పార్టీ నేతలు నగరం చుట్టూ ఉన్న 464 చెరువులు, కుంటలను మాయం చేశారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి మరోసారి పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో భజన సంస్కృతి నడుస్తోందని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.
విద్యాసంస్థలను నాశనం చేసిన్రు : హరగోపాల్
తెలంగాణ పేరుతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని తెలంగాణను గాలికొదిలేసిందని ప్రొ. హరగోపాల్ అన్నారు. ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు తెలంగాణ గుర్తుకు వస్తుందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ విద్యాసంస్థలను, వర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు. సీమాంధ్ర సంపన్నులకు మేలు చేసేలా సాగుతున్న పాలనను అంతమొందించే దిశగా ఉద్యమకారులు ముందుకు సాగాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నయీంలాగా మారారని, ఒక దశలో వీళ్లకన్నా నయీమే బెటర్ అనిపించిందన్నారు. సీఎం నుంచి కింది స్థాయి లీడర్ల వరకూ అందరూ భూకబ్జాలు చేస్తున్నారన్నారు. దొంగల రాజ్యం కొనసాగుతున్నపుడు పౌర సమాజం నిఘా పెంచాలని,
అప్పుడే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి, తెలంగాణ పీపుల్స్ జేఏసీ కోకన్వీనర్లు కన్నెగంటి రవి, అంబటి నగేష్, రవిచంద్ర, మైస శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, బి. రమాదేవి, కరుణాకర్ రెడ్డి, నల్లెల రాజయ్య, సోమ రామమూర్తి, సాంబరాజు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.