Insurance Alert: ఎల్ఐసీకి అనుకూలంగా సుప్రీం తీర్పు.. ఆ విషయం దాస్తే క్లెయిమ్స్ రిజెక్ట్..!

Insurance Alert: ఎల్ఐసీకి అనుకూలంగా సుప్రీం తీర్పు.. ఆ విషయం దాస్తే  క్లెయిమ్స్ రిజెక్ట్..!

LIC News: ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ఎంత ఉపయోగకరమనే విషయాలను ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. పైగా ఇటీవల కరోనా తర్వాత ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెరగటం కూడా ఎక్కువ మంది తమ అవసరాలకు అనుగుణంగా పాలసీలను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తోంది. అయితే అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గుడ్డిగా పాలసీ డాక్యుమెంట్లపై ఏజెంట్ చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టారో మీ పని ఔట్.

ఎందుకంటే పాలసీలో కొన్ని సార్లు రహస్యంగా కొన్ని నిబంధనలు దాగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటి గురించి పాలసీ డాక్యుమెంట్లను పూర్తిగా చదివి తెలుసుకోవాలి. అలాగే అన్ని అనుమానాలను పాలసీ కొనుగోలుకు ముందే అడిగి తెలుసుకోవటం తర్వాత అనుకోని పరిస్థితుల్లో పాలసీదారు మరణించినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా కాపాడుతుందని అందరూ గుర్తించాలి. 

హర్యాణాకు చెందిన ఒక వ్యక్తి 2013లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి Jeevan Arogya పాలసీని కొన్నాడు. అయితే ఆ సమయంలో తనకు ఉన్న మద్యపానం అలవాటు గురించి కంపెనీ ఏజెంట్ కు ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి పాలసీ కొన్న నెలల్లోనే సదరు పాలసీదారుడు మరణించాడు. ఆ సమయంలో ఝజ్జర్ లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటుతో మరణించాడు. పాలసీదారు మరణం తర్వాత అతని భార్య క్లెయిమ్ కోసం దరఖాస్తు ఎల్ఐసీ వద్ద దరఖాస్తు చేసింది. అయితే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నట్లు కంపెనీ చెప్పటంతో న్యాయపోరాటం స్టార్ట్ చేశారు. మరణించిన వ్యక్తికి మద్యం తాగే వ్యసనం ఉందని చెప్పకపోవటం వల్లే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలపటంపై మృతుడి భార్య జిల్లా వినియోగదారుల మండలిని ఆశ్రయించింది. 

ALSO READ | Insurance: 99% మందికి తెలియని లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధన.. ఈ ఒక్కటి చేస్తే మీ ఫ్యామిలీ సేఫ్..!

ఇక్కడ సదరు పాలసీదారు కుటుంబానికి అనుకూలంగా తీర్పు రాగా రూ.5 లక్షల 21 వేలు చెల్లించాలని జిల్లా ఫోరమ్ పేర్కొంది. అయితే ఎల్ఐసీ మాత్రం దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయి వినియోగదారుల కమిషన్ కు అప్పీల్ చేసింది. అక్కడ కూడా తీర్పు మృతుడి భార్యకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఈసారి ఎల్ఐసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఎల్ఐసీ మృతుడి మరణం కాలేయ సంబంధిత వ్యాధి వల్ల కాదని గుండెపోటు వల్ల జరిగిందనే వాదననే వినిపించింది. ఈ కేసును విచారణ చేపట్టిన న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఫోరమ్స్ ఇచ్చిన తీర్పును కొట్టివేశారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు..
ఇక్కడ మృతుడు తీసుకున్నది స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ కాదని, కఠినమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని న్యాయమూర్తులు తమ తీర్పులో నొక్కి చెప్పారు. దీర్ఘకాలికంగా ఉన్న మద్యం అలవాటు వల్ల ఆరోగ్యం చెడిపోయినందునే సదరు పాలసీదారుడు మరణించినట్లు కోర్టు గుర్తించింది. అందువల్ల పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడే తనకు ఉన్న తాగుడు అలవాటు గురించి బహిర్గతం చేయాల్సిందని, అలా వాస్తవాన్ని దాచిపెట్టినందున క్లెయిమ్ రిజెక్ట్ చేయటం సబబేనని కోర్టు సమర్థించింది. వాస్తవాలను దాచిపెట్టినందున ఎల్ఐసీకి చెల్లింపు నిరాకరించేందుకు పూర్తి అధికారం ఉంటుందని కోర్టు పేర్కొంది. అయితే మృతుడి భార్య ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఎల్ఐసీ ఇప్పటికే చెల్లించిన రూ.3 లక్షలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

ఈ కేసు నుంచి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి తమ అవసరాల కోసం హెల్త్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేస్తున్నప్పుడు తమ ఆరోగ్య స్థితికి సంబంధించిన లేదా మద్యం, ధూమపానం వంటి అలవాట్ల వివరాలను ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియటం తప్పనిసరి. అలా చేయనిపక్షంలో పైన కేసు మాదిరిగానే చివర్లో పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ కావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది పూర్తిగా పాలసీదారు చేసే తప్పుకిందికి వస్తుందని గుర్తుంచుకోండి.