ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులపై క్రిమినల్​ కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులపై క్రిమినల్​  కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు
  • యూపీ జర్నలిస్టుకు మధ్యంతర రక్షణ కల్పించిన న్యాయస్థానం

న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాస్తున్నారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్​ కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాచేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్​19(1) ప్రకారం వారి భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్టేనని పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వ పాలనపై వార్తా కథనం రాసినందుకు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ అభిషేక్​ఉపాధ్యాయ్​అనే జర్నలిస్ట్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై జస్టిస్​ హృషికేశ్​ రాయ్​, జస్టిస్ ఎస్వీఎన్​భట్టితో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 

కేవలం జర్నలిస్టులు రాసిన రాతలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి, వారిపై క్రిమినల్​ కేసులు పెట్టకూడదని బెంచ్​ పేర్కొన్నది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని యూపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. అప్పటివరకూ జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్​ను అరెస్ట్​ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది.