- కులం ఆధారంగా పనులు అప్పగించడమేంది: సుప్రీంకోర్టు
- జైలు రిజిస్టర్లో కులం కాలమ్ తొలగించాలని ఆదేశం
న్యూఢిల్లీ: జైళ్లలో కుల వివక్షను సహించమని సుప్రీంకోర్టు తెలిపింది. కులం ఆధారంగా ఖైదీలకు బ్యారక్ లు కేటాయించడం, పనులు అప్పగించడం సరికాదని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీల కులం ఆధారంగా పని విభజన ఉందంటూ దాఖలైన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ‘‘అగ్ర కుల ఖైదీలకు వంట పని అప్పగించి.. అట్టడుగు వర్గాల ఖైదీలకు క్లీనింగ్, స్వీపింగ్ పనులు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం. జైలు రిజిస్టర్ లో కులం అనే కాలమ్ ను తొలగించాలి” అని కోర్టు ఆదేశించింది. జైళ్లలో ఇలాంటి నిబంధనలను మూడు నెలల్లోగా మార్చాలని ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాలను ఆదేశించింది.
లాయర్ పై సీజేఐ ఆగ్రహం
ఓ కేసు విచారణలో లాయర్ పై సీజేఐ మండిపడ్డారు. ఆర్బిట్రేషన్ ఆర్డర్ పై లాయర్ మాట్లాడుతూ.. ‘‘మీరిచ్చిన ఆర్డర్ పై కోర్టు మాస్టర్ దగ్గర క్రాస్ చెక్ చేసుకున్నాను” అని చెప్పారు. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘‘అట్ల అడగడానికి నీకెంత ధైర్యం? రేపు నా ఇంటికి వచ్చి నేనేం చేస్తున్నానని నా పర్సనల్ సెక్రటరీని అడుగుతవా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా పదవీ కాలం తక్కువే ఉన్నప్పటికీ, నేనింకా పదవిలోనే ఉన్నానని మరిచిపోకు” అని సీజేఐ హెచ్చరించారు.
ALSO READ | మ్యారిటల్ రేప్‌ను నేరంగా చూడొద్దు: సుప్రీం కోర్టుకు కేంద్రం అఫిడవిట్