దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

దేశద్రోహం చట్టం....సెక్షన్ 124 ఏ పై అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వలస పాలకుల నాటి దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్ర హోం శాఖ తెలిపింది. దీంతో దేశద్రోహ చట్టం అమలుపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. సమీక్ష పూర్తయ్యేవరకు ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది సుప్రీం కోర్టు..

దేశద్రోహ చట్టాన్ని సమీక్షించడంతో.. ఇప్పటికే ఈ చట్టం కింద నమోదైన కేసులు, భవిష్యత్ లో నమోదయ్యే కేసుల గురించి ప్రస్తావించింది ధర్మాసనం. ఈ కేసుల గురించి ఎలాంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని కోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించింది. సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసులు పెట్టకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది. 

నిన్న సుప్రీం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చారు. సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయొద్దనేది సరైన విధానం కాదన్నారు. తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమన్నారు. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని.. కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చు.. మరికొన్ని మనీలాండరింగ్ కేసులు కావొచ్చన్నారు. అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్పీ ర్యాంకు అధికారి నేర తీవ్రతను పరిశీలించి ఆమోదిస్తే కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని కోర్టుకు తెలిపారు తుషార్ మెహతా. పెండింగ్ కేసులను న్యాయపరమైన ఫోరమ్ ముందు పరిశీలించాలని వివరించారు. 

అయితే కేంద్రం వాదనతో ఏకీభవించలేదు సీజేఐ జస్టిస్  ఎన్ .వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని అభిప్రాయపడింది ధర్మసనం. చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని..  చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారని  తెలిపింది. హనుమాన్  చాలీసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అటార్నీ జనరల్ . ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకూ దేశద్రోహ చట్టం అమలు సరికాదని ఆదేశించింది సుప్రీంకోర్టు. పునఃపరిశీలన పూర్తయ్యే వరకు దీని అమలుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. అప్పటివరకు ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయొద్దని సూచించింది. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిల్  కోసం న్యాయస్థానాలకు వెళ్లొచ్చని సూచించారు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.