![చట్టసభలకు సూచనలు చేయలేమన్న సుప్రీంకోర్టు](https://static.v6velugu.com/uploads/2025/02/supreme-court-says-it-cannot-make-suggestions-to-legislatur_XbARn2OBa7.jpg)
- చట్టాలను ఇట్లనే చేయాలని ఆదేశించలేం
న్యూఢిల్లీ: చట్టాలను ఇట్లనే తయారు చేయాలని ఒక నిర్దిష్ట మార్గాన్ని సూచిస్తూ చట్టసభలకు తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. ఏదైనా ఒక చట్టాన్ని ఇట్లనే తయారు చేయాలని ఒక నిర్దిష్ట మార్గాన్ని సూచిస్తూ చట్టసభలకు సుప్రీంకోర్టు గానీ, హైకోర్టులు గానీ ఆదేశాలు ఇవ్వలేవు” అని పేర్కొంది. ఫిర్యాదుదారులు/బాధితులకు కేసు చార్జ్ షీట్‌ను ఫ్రీగా ఇవ్వాలంటూ జిల్లా కోర్టులు, పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఎన్ఎస్ఎస్ 230 సెక్షన్ ప్రకారం.. ఏదైనా కేసులో విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్, ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, పోలీస్ రిపోర్టు, ఇతర డాక్యుమెంట్లను ఫ్రీగా నిందితులు, బాధితులకు అందజేయాల్సి ఉంటుంది” అని తెలిపారు. కాబట్టి ఈ పిల్ వ్యర్థమైనదని, దాన్ని కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. ప్రీ ట్రయల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఫిర్యాదుదారులు/బాధితులు పాలుపంచుకునేందుకు బీఎన్ఎస్ఎస్ 230 సెక్షన్ అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. చట్టాలను ఇట్లనే తయారు చేయాలంటూ ఒక నిర్దిష్ట పద్ధతిని సూచిస్తూ చట్టసభలకు తాము ఆదేశాలివ్వలేమని పేర్కొంది. పిల్ ను కొట్టివేసింది.
అఫిడవిట్లు ఫైల్ చేయండి..
రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్లపై తమ అభిప్రాయం తెలియజేయాలని కేంద్రం, ఎలక్షన్ కమిషన్ ను సుప్రీంకోర్టు కోరింది. అలాగే, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ పార్టీలు కూడా తమ అభిప్రాయం తెలియజేయాలంది. మూడు పేజీలకు మించకుండా తమ అఫిడవిట్లను ఫైల్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ మూడో వారానికి వాయిదా వేసింది.