యూపీలో ఇండ్ల కూల్చివేతలపై సుప్రీం సీరియస్..​ఒక్కో బాధితుడికి 10 లక్షలివ్వండి

యూపీలో ఇండ్ల కూల్చివేతలపై సుప్రీం సీరియస్..​ఒక్కో బాధితుడికి 10 లక్షలివ్వండి
  • మానవత్వం లేకుండా, చట్టవిరుద్ధంగా కూల్చివేశారని ఫైర్​
  •  ప్రయాగ్ రాజ్ లో నలుగురి ఇండ్ల కూల్చివేత కేసులో తీర్పు 
  •  చట్టవిరుద్ధంగా, మానవత్వం లేకుండా కూల్చారంటూ  ఫైర్ ​
  •  అధికారుల తీరుతో షాక్ కు గురయ్యామని కామెంట్ 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ఇండ్ల కూల్చివేతల కేసుల విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అక్రమంగా, అమానవీయంగా కూల్చివేతలు చేపట్టారని, చట్టాన్ని ఏమాత్రం పాటించలేదంటూ తప్పుపట్టింది. ఆ కూల్చివేతల చర్యలతో షాక్ కు గురయ్యామని ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల బెంచ్ కామెంట్ చేసింది. 

అధికారులు అత్యుత్సాహంతో పిటిషనర్ల ఇండ్లు కూల్చివేశారని, వారందరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని యోగి సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా.. 2021లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ (2023లో ఎన్ కౌంటర్ లో చనిపోయాడు)కు చెందిన ఇండ్లుగా భావించిన ప్రయాగ్ రాజ్ అధికారులు నాలుగు ఇండ్లను కూల్చివేశారు. నోటీసులు ఇచ్చిన మరునాడే హడావుడిగా ఇండ్లను నేలమట్టం చేశారు. దీంతో ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ఇండ్లు కోల్పోయిన వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

 దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. వారి పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. తప్పుడు ప్రకటనలు ఇచ్చి పిటిషనర్ల ఇండ్ల కూల్చారని ప్రయాగ్ రాజ్  సివిక్  బాడీని చీవాట్లు పెట్టింది. మానవత్వం లేకుండా, చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని మండిపడింది. ‘‘ప్రభుత్వ తీరు చాలా దురదృష్టకరం. ఇండ్లు నిర్మించే శక్తిలేని వారు కూల్చివేయరాదు. కూల్చివేతలు చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పౌరుల జీవించే హక్కు కిందకు వచ్చే నివసించే ప్రాథమిక హక్కును సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది. 

గ్యాంగ్ స్టర్ అతిక్  అహ్మద్ కు చెందిన ఆస్తులను నేలమట్టం చేస్తున్నామని తప్పుడు నోటీసులు ఇచ్చి ఇండ్లు పడగొట్టారు. ప్రభుత్వ చర్యతో ఇండ్లు కోల్పోయిన బాధితులు లాయర్, ప్రొఫెసర్, ఇద్దరు మహిళలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి” అని సుప్రీంకోర్టు ఆదేశించింది. సరైన ప్రక్రియ చేపట్టకుండానే కూల్చివేతలు చేపట్టారని మండిపడింది. బాధితులకు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించిది. ఆ నోటీసులపై వారు కనీసం సవాలు చేసే టైమ్  కూడా ఇవ్వలేదని ఫైర్ అయింది. 

బాలిక వైరల్ వీడియోను ప్రస్తావించిన బెంచ్ 

యూపీ జలాల్ పూర్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో 2024, అక్టోబర్ 15న అధికారులు గుడిసెలను కూల్చివేస్తుండగా, ఓ ఎనిమిదేండ్ల బాలిక బుక్స్ ను పట్టుకుని భయంతో పరుగెత్తిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఆ వైరల్ వీడియోను గుర్తు చేసింది. 

‘‘గతంలో బుల్డోజర్లతో గుడిసెలను తొలగిస్తుండగా తీసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఒక చిన్న అమ్మాయి కూలుతున్న గుడిసెల ప్రాంతం నుంచి దూరంగా పరుగెడుతున్నది. భయంతో పరుగెత్తుతున్న ఆ చిన్నారి చేతుల్లో బుక్స్ ఉన్నాయి. ఆ వీడియో ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది” అని ఆ వీడియో గురించి ప్రస్తావించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకే పంచాయతీ భూమిని ఆక్రమించి వేసిన గుడిసెలను తాము తొలగించామని అప్పట్లో జలాల్ పూర్ పోలీసులు తెలిపారు.

బాధితులకు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు ఎలా చేపడతారు. ఆ నోటీసులపై వారు కనీసం సవాలు చేసే టైమ్  కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ తీరు చాలా దురదృష్టకరం. కూల్చివేతలు చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పౌరుల జీవించే హక్కు కిందకు వచ్చే రైట్​ టూ షెల్టర్​ను సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది. గ్యాంగ్ స్టర్  అతిక్  అహ్మద్​కు చెందిన ఆస్తులను నేలమట్టం చేస్తున్నామని  నోటీసులు ఇచ్చి ఇండ్లు పడగొట్టారు. ప్రభుత్వ చర్యతో ఇండ్లు కోల్పోయిన బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.            
- సుప్రీంకోర్టు