మహిళా అడ్వకేట్​పై హైకోర్టులోనే కామెంట్లా?

మహిళా అడ్వకేట్​పై హైకోర్టులోనే కామెంట్లా?
  • కర్నాటక జడ్జిపై సుప్రీంకోర్టు సీరియస్ 
  • రెండ్రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కర్నాటక హైకోర్టు​కు ఆదేశం 
  • బెంగాల్​లో ఎన్నికల తర్వాత హింస కేసులో సీబీఐపైనా సుప్రీంకోర్టు అసహనం 

న్యూఢిల్లీ : కర్నాటక హైకోర్టులో ఓ జడ్జి చేసిన అభ్యంతరకర కామెంట్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. హైకోర్టులోనే ఒక మహిళా అడ్వకేట్ పై, అలాగే ఓ వర్గం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. బెంగళూరు సిటీలోని ఓ ఏరియాలో ఒక భూయజమాని, కిరాయిదారుకు మధ్య వివాదం కేసులో గురువారం విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీషానంద అభ్యంతరకర కామెంట్లు చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. 

సిటీలోని సంబంధిత ఏరియా పాకిస్తాన్​లా మారిపోయిందంటూ జడ్జి ఒక వర్గం వారిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించినట్టు ఒక వీడియోలో ఉంది. అలాగే, హైకోర్టులో కేసును వాదిస్తున్న మహిళా అడ్వకేట్ ఒకరు ప్రత్యర్థి పార్టీ గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవాలని ఆత్రుత కనపరుస్తున్నారని, ఎక్కువగా తెలుసుకుంటేనే వారి దుస్తుల కింద ఉన్న రంగు ఏంటో తెలుస్తుందని ఆమె భావిస్తున్నారంటూ కామెంట్ చేసిన మరో వీడియో కూడా వైరల్ అయింది. దీనిపై సంబంధిత మహిళా అడ్వకేట్ ట్విట్టర్​లో పోస్టు పెట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు.

దీంతో ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్ బెంచ్ శుక్రవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్రీషానంద వ్యాఖ్యలపై రెండు రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కర్నాటక హైకోర్టు ను ఆదేశించింది. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కోర్టుల్లో జడ్జిల కామెంట్ల విషయంలో తగిన గైడ్ లైన్స్ జారీ చేస్తామని బెంచ్ తెలిపింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. 

సీబీఐ తీరుపైనా అసహనం.. 

బెంగాల్​లో 2021లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన కేసులను ట్రాన్స్ ఫర్ చేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేయడంపైనా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పిటిషన్ ను వాపస్ తీసుకోకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ఈమేరకు జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ బెంచ్ శుక్రవారం హెచ్చరించింది.

బెంగాల్ లోని కోర్టులన్నింటి పట్లా అనుమానాలు వ్యక్తం చేస్తూ, అన్ని కేసులను ట్రాన్స్ ఫర్ చేయాలని కోరడం అంటే మొత్తం న్యాయ వ్యవస్థను తప్పుపట్టడమేనని బెంచ్ స్పష్టం చేసింది. వెంటనే పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. దీంతో సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు స్పందిస్తూ.. న్యాయవ్యవస్థను తప్పుపట్టాలన్న ఉద్దేశం లేదని, పిటిషన్ ను రాసిన తీరులోనే పొరపాటు జరిగిందన్నారు.