నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎట్ల కూల్చుతరు?

నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎట్ల కూల్చుతరు?

యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, వెలుగు: నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎలా కూల్చుతారని యూపీ​ సర్కారుపై సుప్రీంకోర్టు సీరియస్​ అయింది. తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని సౌండ్ స్పీకర్ లో  చెప్పడమేంటని  ప్రశ్నించింది.  బాధితుడికి రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సర్కారును ఆదేశించింది. రోడ్డు విస్తరణకు సంబంధించి ఎలాంటి నోటీసులు లేకుండా యూపీలోని మహరాజ్ గంజ్ లో మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. 2019లో ఈ ఘటన జరగగా.. కింది స్థాయిలో న్యాయపోరాటం చేసి 2020 నవంబర్ 7న బాధితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.

బుధవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది.  పిటిషనర్ ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ప్రభుత్వ వాదనపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.  ‘‘అతడు 3.7 చదరపు మీటర్ల భూమిని ఆక్రమించారని చెబుతున్నారు. కానీ దీనిపై మీరు ఎలాంటి ధ్రువీకరణ పత్రం సమర్పించలేదు. అయినా.. మీరు ప్రజల ఇళ్లను ఎలా కూలుస్తారు? మీరు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని మా వద్ద అఫిడవిట్ ఉంది.

ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చడం సరికాదు. ఇది అక్రమం” అని సీజేఐ వ్యాఖ్యానించారు. మధ్యలో పిటిషన్ తరఫు న్యాయవాది కలుగ జేసుకొని... ‘ఈ ఇంటితోపాటు మరో 123 నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు’’అని కోర్టుకు నివేదించారు. దీంతో బుల్డోజర్ కూల్చివేతలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇల్లు ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది.