గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీస్కోవాల్సిందే: సుప్రీంకోర్టు

గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీస్కోవాల్సిందే: సుప్రీంకోర్టు
  • రాష్ట్రపతికి తొలిసారిగా గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు 
  • రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉండదు
  • ఆర్టికల్ 201 ప్రకారం జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడాలని కామెంట్స్ 
  • గవర్నర్ బిల్లులను పెండింగ్ పెట్టడాన్ని తప్పుపట్టిన బెంచ్  
  • ఆ కేసులో సంచలన తీర్పు 
  • తీర్పు కాపీ తాజాగా వెబ్ సైట్​లో అందుబాటులోకి

న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి తప్పనిసరిగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువును నిర్దేశించింది. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్‎లో పెట్టడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‎తో కూడిన బెంచ్ మంగళవారం ఈమేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు, గవర్నర్ల ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపాలని కోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పు కాపీ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటలకు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

 ‘‘ఆర్టికల్ 201 ప్రకారం, ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినట్టయితే.. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి. కానీ రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలన్నది రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంతమాత్రాన రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’ అధికారం ఉందని అనుకోరాదు. అందుకే రాష్ట్రపతి బిల్లు అందిన తేదీ నుంచి తప్పనిసరిగా మూడు నెలల్లోపు ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాల్సిందే. రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించడంలో ఈ సాధారణ న్యాయ సూత్రం తనకు వర్తించదని అనుకోరాదు” అని బెంచ్ అభిప్రాయపడింది.

డెడ్ లైన్ దాటితే రాష్ట్రాలు కోర్టులకెళ్లొచ్చు.. 

ఒకవేళ ఏదైనా బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి 3 నెలలకు మించిన సమయం అవసరమైనట్టయితే, అందుకు గల కారణాలను సంబంధిత రాష్ట్రానికి రాష్ట్రపతి తెలియజేయాలని సుప్రీం సూచించింది. రాష్ట్రాలు కూడా రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలకు త్వరగా వివరణలు ఇచ్చి సహకరించాలని తేల్చిచెప్పింది. అలాగే రాష్ట్రపతి ఈ డెడ్ లైన్​లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే.. సంబంధిత రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా స్పష్టం చేసింది.

అయితే, ఏదైనా ఒక బిల్లు విషయంలో  రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రం కార్యనిర్వాహక వ్యవస్థ కోర్టుల పాత్ర పోషించరాదని.. ఆర్టికల్ 143 ప్రకారం, దానిని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని పేర్కొంది. కాగా, తమిళనాడు అసెంబ్లీలో పాస్ చేసి పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్​లో పెట్టారు. దీనిపై డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అసెంబ్లీ రెండోసారి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సిందేనని తీర్పు చెప్పింది.