PM Modi Punjab Visit: సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీతో కమిటీ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపంపై సుప్రీంకోర్టు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దర్యాప్తునకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ కమిటీ ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘనకు గల కారణాలు, దానికి బాధ్యులైన వ్యక్తులు, VVIPల భద్రతా ఉల్లంఘనలను నిరోధించడానికి భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై ప్యానెల్ విచారిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీ ప్యానెల్ లో జస్టిస్ (రిటైర్డ్) ఇందు మల్హోత్రా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ,  పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉంటారు.

జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు మార్గంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ర్యాలీకి వెళ్తుండగా, దారిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధానమంత్రి కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన తిరిగి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే ఈ ఘటనపై  సుప్రీంలో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది మనిందర్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం కేవలం శాంతిభద్రతల అంశం మాత్రమే కాదని, అది స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టుకు తెలిపారు. ఎస్పీజీ సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర, ఇతర స్థానిక అధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని రక్షణ జాతీయ భద్రత అంశమని, పార్లమెంటరీ పరిధిలోకి వస్తుందని వివరించారు.