వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. విన్నపాలు ఏవైనా హైకోర్టు ముందే చెప్పుకోవాలంటూ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టి వేయాలంటూ భార్గవ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణకు తిరస్కరించింది జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. గతంలో జరిగిన వ్యవహారాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు సజ్జల తరపు లాయర్ కపిల్ సిబాల్.
కపిల్ సిబాల్ వాదనకు బదులుగా.. చట్టాలు ఎప్పటివి అన్నది ముఖ్యం కాదని.. మహిళలు, ప్రజా ప్రతినిధులు అని కూడా చూడకుండా చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా . సోషల్ మీడియాలో ప్రముఖులపై అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ కీలకంగా వ్యవహరించారని సిద్దార్ట్ లూథ్రా వ్యాఖ్యానించారు.
ALSO READ : డిసెంబర్ 9 వరకు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దు: ఏపీ హైకోర్టు
సజ్జల ప్రస్తుతం దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని... సుప్రీంకోర్టు ముందు కూడా చాలా విషయాలు గోప్యంగా ఉంచారన్నారు లూథ్రా.ఈ క్రమంలో దుర్భాషలు, అభ్యంతర కరమైన భాష ఉపయోగించే ఎవరైనా చట్ట పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సజ్జల భార్గవ్ కు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు రెండు వారాల సమయం ఇచ్చిన ధర్మాసనం.. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పింది.
ఇరు పక్షాల వాదనలు విని తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హైకోర్టుకు ఉందని.. రెండు వారాలు వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ.. తదుపరి నిర్ణయం హైకోర్టుదేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.