
- కేంద్ర రోడ్డు రవాణా శాఖ సెక్రటరీకి సమన్లు జారీ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుల కోసం క్యాష్లెస్ట్రీట్మెంట్ స్కీం రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంపై గతంలో సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలేంటో వీడియో కాన్ఫరెన్స్ద్వారా విచారణకు హాజరై వివరించాలంటూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులను కోర్టులకు పిలిపించినప్పుడు మాత్రమే వారు న్యాయస్థానాల ఆదేశాల విషయంలో సీరియస్‌గా ఉంటారని పేర్కొంది.
కేసు విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. వాహన ప్రమాద బాధితులకు ఫ్రీగా ట్రీట్మెంట్అందించేలా స్కీమ్ రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడి బెంచ్ జనవరి 8న ఆదేశించింది. ఇందుకోసం మార్చి 15వ తేదీని గడువుగా నిర్దేశించింది. గోల్డెన్అవర్(ప్రమాదానికి గురైన గంట లోపు)లో ట్రీట్మెంట్ ఇస్తే బాధితులకు చాలా వరకు ప్రాణాపాయం తప్పుతుందని.. ఈ దిశగా చర్యలు చేపట్టాలని తన తీర్పులో పేర్కొంది. అయితే ఆదేశాలు అమలవకపోవడంపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర రోడ్డు, రవాణా శాఖతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.