
- ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీసు తరఫున వాదనలు
- నిర్ణయం తీసుకునే దాకా ఆగకుండా పిటిషన్లు వేస్తనే ఉన్నరు
- స్పీకర్‌కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చింది
- ఆయన డెసిషన్ తీసుకున్నాకే న్యాయ సమీక్షకు చాన్స్ ఉంటుంది
- బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహత్గి
- స్పీకర్ నిర్ణయం కోసం నాలుగేండ్లయినా చూస్తూ ఉండాల్సిందేనా?: బెంచ్
న్యూఢిల్లీ, వెలుగు: స్పీకర్‌కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చిందని, ఆయన స్వతంత్రుడని సుప్రీంకోర్టుకు అసెంబ్లీ స్పీకర్ ఆఫీసు తరఫున అడ్వకేట్ ముకుల్ రోహత్గి నివేదించారు. ‘‘స్పీకర్ స్వతంత్రుడు.. కోర్టులు ఆయనకు ఆదేశాలు ఇవ్వలేవు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు’’ అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ముందు రోహత్గి ఈ వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జి మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
స్పీకర్ ఆఫీస్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి, అసెంబ్లీ సెక్రటరీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వి హాజరయ్యారు. తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘‘స్పీకర్ స్వతంత్రుడు.. ఫిరాయింపుల అంశంపై ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాతనే దానిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఇందుకు జస్టిస్ గవాయి స్పందిస్తూ... ‘‘సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని మేం స్పీకర్‌కు చెప్పలేమా?’’ అని ప్రశ్నించారు.
అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేయొచ్చని పేర్కొన్నారు. ఇందుకు రోహిత్గీ బదులిస్తూ.. వారం రోజులన్నా ఆగకుండా ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు వేశారని, స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ వాళ్లు(పిటిషనర్లు) ఆగలేదని, కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా వ్యవహరించారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే.. సరైన సమయం అంటే మీ దృష్టిలో ఎంతకాలమని జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ ప్రశ్నించారు. ఇందుకు రోహత్గీ సమాధానం ఇస్తూ... అది స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
చూస్తూ ఉండాల్సిందేనా?: బెంచ్
రోహత్గీ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. 11 నెలలుగా ఫిరాయింపులపై స్పీకర్ స్పందించలేదు. మేం జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే నాలుగేండ్లయినా చూస్తూ ఉండాల్సిందేనా?’’ అని వ్యాఖ్యానించింది.గతంలో ఒక స్పీకర్ ను కోర్టుకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది.
ఉప ఎన్నికలపై సీఎం కామెంట్లు సరికాదు
ఉప ఎన్నికలు రావంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్‌ఎస్ తరఫు అడ్వకేట్ఆర్యమా సుందరం తీసుకెళ్లారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, కొంత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడింది. రోహత్గీ బదులిస్తూ... సీఎం వ్యాఖ్యలపై తాము వాదనలు వినిపించడం లేదన్నారు.
కాగా.. బుధవారం ముకుల్ రోహత్గీ తన వాదనలు ముగించారు. అనంతరం అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మనుసింఘ్వి, ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్ రవిశంకర్ జంధ్యాల వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ వాదనలు వినేందుకు గురువారం ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం టైం కేటాయించింది.