స్లిప్పులు లెక్కించడానికి ఇబ్బంది ఏంది?

వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థతో పాటు దేశంలోని వ్యవస్థలేవీ సలహాలు, సూచనలకు అతీతం కాదని ఈసీకి హితవు పలికింది. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున లెక్కిస్తున్న వీవీప్యాట్ శాంపిల్స్ ను పెంచడానికి ఇబ్బందేంటని ప్రశ్నించింది. ఈవీఎంల పనితీరుపై నమ్మకం ఉన్నపుడు అడగకముందే ఈ పని చేయాల్సిందని వ్యాఖ్యానించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాల నేపథ్యంలో వీవీప్యాట్ల లెక్కింపు శాం పిల్స్ ను 50 శాతానికి పెంచాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా శాం పిల్స్ పెంచితే ఈసీకి ఎదురయ్యే ఇబ్బందులేంటో కోర్టుకు వివరించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. ఈవీఎంల పనితీరుపై తమకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని, వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ జవాబిచ్చిం ది. అయినప్పటికీ మరింత పారదర్శకత కోసం వీ వీప్యాట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈసీ ప్రతినిధి జవాబిస్తుండగా సీజేఐ కల్పిం చుకుంటూ ‘సూచనలను తిరస్కరిస్తే ఏ వ్యవస్థ కూడా మెరుగుపడద’ని కామెంట్ చేశారు. ఈ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ మూడు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఈసీని ఆదేశిస్తూ ,కేసును ఏప్రిల్ 1కు బెంచ్ వాయిదా వేసింది.