బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుస్టే విధించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సందర్భంగా ఆయన అఫిడవిట్‌లో ఫామ్– 26లో వాస్తవ సమాచారం పొందుపరచలేదు. దీంతో పాటు ప్రభుత్వానికి ఉన్న బకాయిలను కూడా సరిగా చెల్లించలేదనే అభియోగాలపై హైకోర్టులో కేసు నమోదైంది. వీటిపై నాలుగేళ్లు విచారణ జరిగింది.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ జలగం వెంకట్‌రావు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌లో వనమాపై పెట్టిన కేసు వివరాల్ని వనమా వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పలేదన్న జలగం న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. వనమా వెంకటేశ్వరరావు స్థానంలో పిటిషనర్ జలగం వెంకట్‌రావును విజేతగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.