లోక్‌‌పాల్ పరిధిలోకి జడ్జిలు రారు: సుప్రీం

లోక్‌‌పాల్ పరిధిలోకి జడ్జిలు రారు: సుప్రీం
  • ఉత్తర్వులపై స్టే విధిస్తూ రిజిస్ట్రార్​కు నోటీసులు జారీ
  • కేంద్రంతోపాటు రిజిస్ట్రార్​కుసుప్రీంకోర్టు నోటీసులు
  • లోక్‌పాల్  ఉత్తర్వు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే  విధంగా ఉందని కామెంట్​

న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను విచారించే అధికారం తమకు ఉందని పేర్కొంటూ ఇటీవల లోక్‌‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. లోక్‌‌పాల్ ఇచ్చిన ఈ ఉత్తర్వు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉందని వ్యాఖ్యానించింది.  ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, లోక్‌‌పాల్ రిజిస్ట్రార్​కు, హైకోర్టు న్యాయమూర్తిపై కంప్లైంట్ చేసిన ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేసింది. 

ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కేసులో హైకోర్టు సిట్టింగ్ జడ్జి.. అదనపు జిల్లా జడ్జిని, మరో హైకోర్టు జడ్జిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తిపై దర్యాప్తుకు ఆదేశిస్తూ లోక్‌‌పాల్ బెంచ్ జనవరి 27న ఉత్తర్వులిచ్చింది. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను విచారించే అధికారం తమకు ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. దీనిపై  జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఓక్‌‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. లోక్‌‌పాల్ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులను లోక్‌‌పాల్ పరిధిలోకి తీసుకురాలేదని తెలిపారు. వాదనల అనంతరం సుప్రీం కోర్టు.. లోక్‌‌పాల్ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఫిర్యాదులో పేర్కొన్న జడ్జి పేరును బహిర్గతం చేయవద్దని లోక్‌‌పాల్‌‌కు ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.