పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు.
జార్ఖండ్ కోర్టు ఆర్డర్ పై రాహుల్ గాంధీ వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ విచారించింది. తనపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా వేసిన కేసును కొట్టేయాల్సిందిగా రాహుల్ గాంధీ వేసిన క్వాష్ పిటీషన్ ను జార్ఖండ్ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాహుల్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయగా.. తాజాగా సుప్రీం కోర్టు జార్ఖండ్ కోర్టు ఆర్డర్ పై స్టే విధించింది.
పరువు నష్టం కేసులో సంబంధిత వ్యక్తి వేయాలని, వారి కార్యకర్తలు లేదా ఇతరులు వేయడం కాదని గతంలో జార్ఖండ్ కోర్టులో రాహుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సింఘ్వీ వాదనలపై స్పందించాలనినవీన్ ఝా, జార్ఖండ్ ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం ఇచ్చింది జార్ఖండ్ కోర్టు.
అయితే ఫిబ్రవరి, 2024లో పరువు నష్టం కేసుపై రాహుల్ గాంధీ వేసిన క్వాష్ పిటీషన్ ను తిరస్కరించింది జార్ఖండ్ ట్రయల్ కోర్టు . దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయగా తాజాగా స్టే విధించింది సుప్రీం కోర్టు.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ను హత్యానేరం ఉన్న నిందితుడిగా, బీజేపీ నేతలను అబద్ధాలు ఆడేవారిగా రాహుల్ అన్నారని 2018లో నవీన్ ఝా అనే వ్యక్తి జార్ఖండ్ లో పరువునష్టం కేసు వేసిన విషయం తెలిసిందే.