కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలిచ్చింది. స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం3:30 గంటల లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్కు స్పష్టం చేసింది. హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదని సుప్రీం క్లారిటీ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకొద్దని తెలంగాణ సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

HCU భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ అంశం తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చాక మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపంది. 

కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టుకు విషయాన్ని వెల్లడించారు. అయితే.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి 'స్టే' ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు సింఘ్వీకి స్పష్టం చేసింది.

కంచ గ‌‌‌‌‌‌‌‌చ్చిబౌలి గ్రామ స‌‌‌‌‌‌‌‌ర్వే నంబ‌‌‌‌‌‌‌‌ర్ 25లోని 400 ఎక‌‌‌‌‌‌‌‌రాల ప్రభుత్వ భూమి హ‌‌‌‌‌‌‌‌క్కుల‌‌‌‌‌‌‌‌ను టీజీఐఐసీకి బ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌లాయిస్తూ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి 2024  జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంప‌‌‌‌‌‌‌‌ల్లి మండ‌‌‌‌‌‌‌‌ల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎక‌‌‌‌‌‌‌‌రాల భూమికి సంబంధించి పంచ‌‌‌‌‌‌‌‌నామా నిర్వహించి 2024 జులై 1న టీజీ ఐఐసీకి అప్పగించారు. అప్పటినుంచి ఆ 400 ఎక‌‌‌‌‌‌‌‌రాల  భూమి ప్రభుత్వం స్వాధీనంలో ఉంది.  కొన్ని మీడియాల్లో   వ‌‌‌‌‌‌‌‌స్తున్నట్టు ఇందులో అట‌‌‌‌‌‌‌‌వీ భూమి లేదు. రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. 

కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్​(టీజీఐఐసీ) ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీకి కేటాయించిన 400 ఎక‌‌‌‌రాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ)కి అంగుళం భూమి కూడా లేదని  స్పష్టం చేసింది.

కంచ గచ్చిబౌలి గ్రామంలో దాదాపు 400 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా క్లియర్ చేసి, చెట్లను నరికేస్తున్నారని, దీని వల్ల అరుదైన చెట్లు, సరస్సులు, ప్రత్యేకమైన రాళ్ల నిర్మాణాలు దెబ్బతింటున్నాయనేది ప్రతిపక్షాల వాదన. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐసీ) ఆక్రమణలకు పాల్పడుతోందని, ఆ భూముల్లోని చెట్లు, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.