
- కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- ప్రొఫెసర్ సాయిబాబా, ఫాదర్ స్టాన్ స్వామి మరణాలపై కోర్టులో దాఖలైన పిల్
న్యూఢిల్లీ, వెలుగు: జైళ్లలో దివ్యాంగ ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు ప్రొషెసర్ జీఎన్ సాయిబాబా, ఫాదర్ స్టాన్ స్వామికి జైల్లో సరైన వసతులు కల్పించపోవడం వల్లే వారు మరణించారని ఆరోపిస్తూ.. సత్యన్ నరోవూర్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. భీమా కోరేగావ్ హింస కేసులో విచారణ ఖైదీగా జైలులో ఉండగానే స్టాన్ స్వామి 2021లో ప్రాణాలు విడిచారు. అలాగే, 2014 లో మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్ అయిన జీఎన్ సాయిబాబా ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన కొన్ని నెలల తర్వాత మరణించారు. ఈ ఇద్దరి మరణాల వెనక జైళ్లలో దివ్యాంగ ఖైదీల పట్ల తీవ్ర నిర్లక్ష్యం, అనుకూలమైన వసతి, వాష్ రూంలు, ఇతర సౌకర్యాల కొరతే కారణమని పిటిషనర్ ఆరోపించారు.
పిటిషనర్ తరపు అడ్వొకేట్ కాళీశ్వరం రాజ్ వాదనలు వినిపిస్తూ.. జైళ్లలో ఉన్న దివ్యాంగుల హక్కుల కోసం 2016 లో చట్టం అమలులోకి వచ్చినా.. ఇప్పటికీ దేశంలోని చాలా జైళ్లలో ర్యాంప్ లు, దివ్యాంగుల టాయిలెట్లు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అసౌకర్యాలు జైళ్లలో దివ్యాంగ ఖైదీల ప్రాథమిక కదలికను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఎత్తి చూపారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా భారత్ లో జైలు వ్యవస్థను తీసుకురావడానికి శాసన, పరిపాలన సంస్కరణలను పిటిషనర్ తరఫు న్యాయవాది ఎత్తి చూపారు. ఈ వాదలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిల్ పై సమాధానాన్ని నాలుగు వారాల్లో సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.