వీఐపీ దర్శనాలు సమానత్వ హక్కు ఉల్లంఘనే: సుప్రీంకోర్టులో పిటిషన్

వీఐపీ దర్శనాలు సమానత్వ హక్కు ఉల్లంఘనే: సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని పలు ఆలయాల్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్(వీఐపీ) దర్శనాలు సమానత్వ హక్కు ఉల్లంఘన కిందికే వస్తాయని విజయ్ కిశోర్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలు, ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు. ఒక వ్యక్తి స్థాయి, ఆర్థిక పరిస్థితిని బట్టి దర్శనాలు కల్పించడం అంటే.. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అని గోస్వామి పిటిషన్ లో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అనేక ఆలయాల్లో వీఐపీ దర్శనాలు జరుగుతున్నాయని... ఈ తరహా దర్శనాలతో పేద, సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

భగవంతుడి సన్నిదిలో అందరూ సమానమే అయినప్పుడు.. వీఐపీ టికెట్లకు డబ్బులు చెల్లిస్తున్న వారిని ప్రత్యేకంగా చూడడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నవారికి నిమిషాల్లో దర్శనం.. డబ్బులు లేవనే కారణంతో పేద వాళ్లను గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెట్టడం సరికాదన్నారు. స్పెషల్ కేటగిరీ లేకుండా భక్తులందరినీ సమానంగా చూసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆయన కోరారు. అన్ని దేవాలయాలు, మతపరమైన నిర్మాణాలు, పవిత్రమైన బహిరంగ ప్రదేశాల్లో దర్శనాలు, ప్రార్థనల్లో భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనికోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కాగా ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకొన్న బెంచ్.. డిసెంబర్ రెండో వారంలో విచారణ చేపడతామని వెల్లడించింది.