కృష్ణా ప్రాజెక్టులపై 4న సుప్రీంకోర్టులో విచారణ

కృష్ణా ప్రాజెక్టులపై  4న సుప్రీంకోర్టులో విచారణ
  • తెలంగాణ, ఏపీ పిటిషన్లను వేర్వేరుగా విచారించనున్న కోర్టు
  • ఈ నెల 6 నుంచి 8 వరకు కృష్ణా వాటాపై కేడబ్ల్యూటీ2లో వాదనలు 

హైదరాబాద్, వెలుగు: కృష్ణా ప్రాజెక్టుల పరిధిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నెల 4న తెలంగాణ, ఏపీ పిటిషన్లను వేర్వేరు బెంచ్​లు విచారించనున్నాయి. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్​ బీఆర్  గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం విచారణ జరపనుండగా.. ఏపీ వేసిన పిటిషన్​ను జస్టిస్​ అభయ్​ ఎస్  ఓకా, జస్టిస్​ అగస్గీన్​ జార్జ్​ మాసిల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

కృష్ణా బేసిన్​పై ఉన్న నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టులు ప్రస్తుతం కేఆర్​ఎంబీ (కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు) అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ 2021లో కేంద్రం ఇచ్చిన గెజిట్​ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర సర్కారు పిటిషన్​ వేసింది. అందుకు భిన్నంగా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు ఏపీ సిద్ధపడింది.

 ఈ కేసు గత నెల 18నే కోర్టులో విచారణకు వచ్చినప్పటికీ.. బెంచ్​లో తెలుగు వ్యక్తి ఉండడంతో మరో బెంచ్​కు బదిలీ చేయాలని సూచించారు. తాజాగా రెండు రాష్ట్రాల పిటిషన్లను వేర్వేరు బెంచ్​లకు బదిలీ చేశారు. కాగా, కృష్ణా జలాల వాటాపై ఈ నెల 6 నుంచి కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 2 (బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​) విచారణ చేపట్టనుంది. కృష్ణా జలాల్లో 555 టీఎంసీలకు మన రాష్ట్రం పట్టుబడుతున్నది. తెలంగాణకు అన్ని కేటాయింపుల్లేవని వాదిస్తున్నది. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలూ ఇప్పటికే ట్రిబ్యునల్​లో స్టేట్​మెంట్​ ఆఫ్​ కేస్​, అఫిడవిట్లు, అదనపు డాక్యుమెంట్లను సమర్పించాయి. ఈ నెల 8 వరకు మూడు రోజుల పాటు ట్రిబ్యునల్​ విచారణ కొనసాగనుంది.