‘బుల్డోజర్ జస్టిస్’పై యూపీ సర్కార్​కు సుప్రీంకోర్టు వార్నింగ్

‘బుల్డోజర్ జస్టిస్’పై యూపీ సర్కార్​కు సుప్రీంకోర్టు వార్నింగ్

న్యూఢిల్లీ: ‘బుల్డోజర్ జస్టిస్’పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ‘‘మా ఆర్డర్‌‌‌‌ను ఉల్లంఘించి రిస్క్ తీసుకోవాలనుకుంటే.. అది మీ ఇష్టం’’అని కామెంట్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశించింది. కూల్చివేతలకు సంబంధించి దాఖలైన పిటిషన్​ను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదనలు వినిపించారు. ‘‘బహ్రెయిచ్ జిల్లాలో అక్టోబర్ 13న దుర్గా మాతా నిమజ్జన సమయంలో అల్లర్లు చెలరేగాయి. 22 ఏండ్ల యువకుడు చనిపోయాడు. నా క్లయింట్, అతడి సోదరులు సరెండర్ అయ్యారు. 18న వాళ్ల ఇంటికి నోటీసులు అతికించారు. దీనిపై అలహాబాద్​ హైకోర్టును ఆశ్రయించగా.. నోటీసులకు జవాబు ఇచ్చేందుకు గడువును 15 రోజులకు పెంచింది. కక్షపూరితంగానే ప్రభుత్వం కూల్చివేతల నోటీసులు ఇచ్చింది’’  అని అడ్వకేట్ సీయూ సింగ్ వివరించారు.