
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కి సుప్రీంకోర్టు మీద కోపం వచ్చినట్టుంది. చాలారోజుల నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును నియంత్రించాలని ఆయన తన భావాలను వెలిబుచ్చుతూనే ఉన్నారు. ఢిల్లీలోని న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కలకలం తరువాత కొలీజియం విషయం లేవనెత్తారు. అప్పడు ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే.. న్యాయ స్వేచ్ఛకి భంగం కలగకుండా న్యాయమూర్తులకు జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకొనిరావాల్సిన దాని గురించి మాట్లాడాలి. కానీ, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని న్యాయమూర్తుల ఎంపికలో జోక్యం చేసుకోవాలని ఆయన ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అంతే. ఇప్పుడు మాట్లాడాల్సింది తమిళనాడు గవర్నర్ ఎన్.రవి 10 బిల్లుల విషయంలో సుదీర్ఘకాలం ఆమోద ముద్ర వేయకపోవడం గురించి మాట్లాడాల్సిందిపోయి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 గురించి మాట్లాడుతున్నారు. సందర్భం ఒకటి.. ఆయన మాట్లాడుతోంది మరొకటి. రాజ్యాంగంలో అన్ని వ్యవస్థల అధికారాలను స్పష్టంగా చెప్పారు. న్యాయవ్యవస్థ పాలించదు.
కార్యనిర్వాహక వ్యవస్థ తీర్పులు చెప్పదు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ లోగొంతుకతో కాకుండా గట్టిగానే సుప్రీంకోర్టు మీద బహిరంగ దాడి చేశారు. ఆ దాడి ద్వారా చాలాకాలంగా ఉన్న సంస్థాగత ఘర్షణని మరోసారి తెరపైకి తెచ్చారు. ఆయన మాటలు న్యాయవ్యవస్థను హెచ్చరించినట్టుగా ఉన్నాయి. ధన్‌ఖడ్ సుప్రీంకోర్టు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కోపంగా ఉన్నారు. ఆయన కూడా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు. పార్లమెంటు సభ్యులు చర్చించాల్సిన విషయాలను ఆయన చర్చించడం, గొడవ చేయడం మొదలుపెట్టారు. ఇది ఉప రాష్ట్రపతి హోదాకి తగని పని.
న్యాయ వ్యవస్థకు.. జవాబుదారీతనం లేదా ?
భారత రాష్ట్రపతికి బిల్లుల విషయంలో టైమ్‌లైన్‌ను జారీ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ సూపర్పార్లమెంటు మాదిరిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఆయన దృష్టిలో న్యాయమూర్తులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. రాజ్యాంగం న్యాయమూర్తులకు ఇచ్చిన పరిధిని దాటుతున్నారని ఆయన రాజకీయ నాయకుడి మాదిరిగా ఆక్రోశిస్తున్నారు. న్యాయమూర్తులు చట్టాలని వ్యాఖ్యానించాలి. కానీ, వాళ్లు ఎలాంటి గడువులను నిర్దేశించకూడదు. ఇదీ ఆయన అభిప్రాయం. రాజ్యసభ ఇంటర్న్లతో మాట్లాడుతూ రాష్ర్టపతి రాజ్యాంగాన్ని రక్షించడానికి మాత్రమే ప్రమాణం చేస్తారని, మిగతా వ్యక్తులు న్యాయమూర్తులతో సహా అందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తారు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరు ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో చెబుతున్నట్టుగా ఉంది. అక్కడితో ఆయన ఆగలేదు.
న్యాయవ్యవస్థ జవాబుదారీతనం లేకుండా పనిచేస్తుందని, న్యాయమూర్తుల అవినీతి కేసుల్లో ఎఫ్ఐఆర్లు ఉండవు. ఆస్తుల వెల్లడి కూడా లేదని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 142 అనేది ‘ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణి’ అని ఆయన అన్నారు. ఈ అధికరణను ఉపయోగించి కోర్టులు చాలా దూరం ప్రయాణం చేశాయి. వాళ్లను పార్లమెంటు వెనక్కి నెట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఎక్కడైతే, ఎప్పుడైతే శూన్యం ఏర్పడుతుందో అప్పుడు ఆ శూన్యాన్ని కోర్టులు నింపుతాయి. న్యాయవాది నుంచి ఉప రాష్ట్రపతిగా మారిన ధన్‌ఖడ్ ఇప్పుడు న్యాయ వ్యవస్థను వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
న్యాయవ్యవస్థకు అపార అధికారం
న్యాయ వ్యవస్థ అన్నది ప్రజలు ఎన్నుకున్నది కాదు. జవాబుదారీతనం లేనిది అయినప్పటికీ అపారమైన అధికారాన్ని కలిగి ఉంది. ఎన్నికల సంస్కరణల నుంచి, గవర్నర్ బిల్లులు జాప్యాల గురించి కోర్టు తన అడుగు వేయడాన్ని కార్య నిర్వాహక వ్యవస్థ జీర్ణించుకోలేకపోతోంది. వాళ్ల భావాలను వ్యక్తపరుస్తున్న వ్యక్తి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్. ఇక్కడ ఆయన ఒక విషయం మరిచిపోతున్నారు. ఆయనను కూడా ప్రజలు ఎన్నుకోలేదు. భారతదేశంలోని న్యాయవ్యవస్థ ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండలేదు. సహేతుకమైన సంయమనాన్ని పాటిస్తుంది. న్యాయవ్యవస్థ తన తీర్పులు ద్వారా మాట్లాడుతుంది.
సందర్భాన్ని బట్టి తీవ్రంగా తన తీర్పులు ద్వారా మాట్లాడుతుంది. పార్లమెంటు విఫలమైన చోట సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. తాను పరిపాలించాలని సుప్రీంకోర్టు అనుకోవడం లేదు. రాజ్యాంగం విఫలమై అనార్కిక్గా మారకుండా ఉండటానికి, రాజ్యాంగాన్ని సమర్థించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఈ విషయాన్ని ఉప రాష్ట్రపతి గమనించాలి. అందువల్లే ప్రజలు ఇంకా కోర్టును విశ్వసిస్తున్నారు. కోర్టులు తాము పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. అందుకే తమ తీర్పులను పున:సమీక్షించుకుంటాయి. తాము చట్ట సంరక్షకులమని కోర్టులకి తెలుసు. రాజకీయ నాయకులకు తాము ప్రజాసేవకులం అని ఇంకా తెలియడం లేదు.
సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించాలి
2016లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అది ఉప రాష్ట్రపతి దృష్టికి రానట్టుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రాల బిల్లులను 3 నెలల వ్యవధిలోగా రాష్ట్రపతి ఆమోదించాలి. ఆ గడువునే సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా నిర్ధారించింది. గవర్నర్లు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, న్యాయమూర్తులందరూ రాజ్యాంగబద్ధంగా నియమితులైనవారే. రాష్ట్రపతి రాజ్యాంగాన్ని రక్షించాలి. అంటే సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించాలి. న్యాయవ్యవస్థ అనేది చాలామందికి చివరి ఆశ్రయం.
ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు పార్లమెంటు ఏమీ చేయలేనప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తారు. దీన్ని అందరూ స్వాగతించాలి. ఇది ఆధిపత్యం పోరాటంగా మారకూడదు. ఆవిధంగా మారితే రెండు వ్యవస్థలూ ఓడిపోతాయి. మరీ ముఖ్యంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఓడిపోతుంది. ఎందుకంటే వాళ్లు ప్రజల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. చివరిగా, ఇది ధనఖడ్ కోపమా? కార్య నిర్వాహక కోపమా?.. ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు.
అయోధ్య టైటిల్ వివాద పరిష్కారంతో అభినందనలు
సుప్రీంకోర్టు అధికారాలకు కత్తెర్లు వేయాలని రాజకీయ వ్యవస్థ భావిస్తుంది. అందుకని‘పూర్తిన్యాయం’ చేయడానికి రాజ్యాంగం ఉపయోగించే ఆర్టికల్ 142 పరిధిని తిరిగి పరిశీలించాలని వాళ్లు భావిస్తున్నారు. దీనికి రాజ్యాంగ సవరణలు అవసరమని ధన్‌ఖడ్ సూచించారు. రాజ్యాంగ బెంచ్ అంటే ఐదుగురు న్యాయమూర్తులు ఉండాలి. ఈ విషయాన్ని ఆర్టికల్ 145 (3) చెబుతున్నది.
రాజ్యాంగం తయారుచేసినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎనిమిది మంది మాత్రమే. కానీ, ఇప్పుడు 30మందికి పైబడి న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఈ రాజ్యాంగ బెంచ్ పరిధిని పెంచాల్సిన అవసరం ఉందని ధన్‌ఖడ్ వాదిస్తున్నారు. ఆర్టికల్ 142ని ఉపయోగించి సుప్రీంకోర్టు అయోధ్య టైటిల్ వివాదాన్ని పరిష్కరించింది. అది ప్రభుత్వానికి సరిపోతుంది. అప్పడు అధికారంలో ఉన్న రాజకీయపక్షం సుప్రీంకోర్టుని అభినందించింది. అది ఇప్పుడు బిల్లుల విషయాలలో మింగుడు పడటం లేదు. ఇప్పడు కోర్టులను విమర్శించడం మొదలైంది. తమిళనాడు గవర్నర్ 10 బిల్లులుపై నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి దగ్గర కూడా ఆగిపోయినవి. వీటికి ఓ గడువును నిర్దేశించడం ఇప్పుడు తప్పుగా మారిపోయింది.
డా. మంగారి రాజేందర్
పూర్వ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ