- టెహ్రాన్‌లో అంతిమయాత్రకు ముందు సుప్రీం లీడర్ ఖమేనీ హాజరు
- రాజధాని సిటీలో వేలాది మందితో సాగిన ర్యాలీ
- భారత్ తరఫున ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ హాజరు
- నేడు రైసీ సొంత పట్టణం మషాద్‌లో అంత్యక్రియలు
టెహ్రాన్: ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లా, ఇతర అధికారులకు గురువారం అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అంతిమయాత్రకు ముందుగా జరిగిన కార్యక్రమానికి సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హాజరయ్యారు. రైసీ, ఇతరుల కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం టెహ్రాన్ వీధుల్లో సాగిన అంతిమయాత్రకు వేలాది మంది జనం తరలివచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల నుంచి సైతం పెద్ద ఎత్తున జనం వచ్చారు. అయితే, 2020లో అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన రెవెల్యూషనరీ గార్డ్ జనరల్ ఖాసీం సులేమానీ అంతిమయాత్రకు వచ్చినంత స్థాయిలో జనం రాలేదని కొందరు అంటుంటే.. హిజాబ్ నిరసనలను అతి దారుణంగా అణచేసినప్పటికీ రైసీ అంతిమయాత్రకు జనం బాగానే హాజరయ్యారని మరికొందరు చెప్తున్నారు. ఇక సులేమానీ మరణం సందర్భంగా పబ్లిక్ గా ఏడ్చేసిన ఖమేనీ.. బుధవారం రైసీ భౌతికకాయం వద్ద సైలెంట్ గా ఏక వాక్యంలో ప్రార్థన చేసి వెంటనే బయలుదేరారు.
దేశ తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ మొఖ్బీర్ మాత్రం అక్కడే నిలబడి కంటతడి పెట్టారు. మరోవైపు మహ్మద్ ప్రవక్త వారసుల వంశానికి చెందిన నేత అయిన రైసీ.. ఖమేనీకి వారసుడిగా సుప్రీం లీడర్ అవుతారని భావించారు. కానీ ఖమేనీ తప్ప ప్రస్తుతం బతికి ఉన్న దేశ మాజీ అధ్యక్షులు ఎవరూ రైసీ అంతిమయాత్రకు ముందు జరిగిన ప్రార్థనలకు హాజరుకాలేదు. కాగా, రైసీ భౌతికకాయాన్ని గురువారం ఆయన సొంత పట్టణం మషాద్ కు తరలించి ఖననం చేయనున్నారు. విదేశాంగ మంత్రి, ఇతర అధికారుల భౌతికకాయాలకు కూడా వారి సొంత ఊర్లలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ హాజరు
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు భారత్ తరఫున ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ హాజరయ్యారు. బుధవారం టెహ్రాన్ కు చేరుకున్న ఆయన రైసీతోపాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ భౌతికకాయాలకు నివాళులు అర్పించారు. రైసీ మృతి నేపథ్యంలో భారత్ లో మంగళవారం ఒక రోజు సంతాప దినంగా కూడా పాటించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కూడా రైసీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.