- మనీలాండరింగ్ నిరోధక చట్టం ఇందుకు అతీతమేమి కాదు
న్యూఢిల్లీ, వెలుగు: విధులు నిర్వహిస్తున్నప్పుడు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 197 (1) మాదిరిగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) వర్తిస్తుందని తేల్చిచెప్పింది. వైఎస్జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా అప్పటి ఐఏఎస్ అధికారి బిభూ ప్రసాద్ ఆచార్య వ్యవహరించారని, భూమి కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం చేశారని ఈడీ గతంలో ఆరోపించింది. ఈ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రముఖ వ్యక్తులతో ఆచార్య కుట్ర పన్నారంటూ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసింది.
పీఎంఎల్ఏ కింద విచారణలో భాగంగా స్పెషల్ జడ్జి.. ఈడీ దాఖలు చేసిన కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకున్నారు. ఆచార్య దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 197 కింద ప్రభుత్వ ఉద్యోగిని ప్రాసిక్యూషన్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఆచార్య తరఫు అడ్వకేట్లు వాదించారు. అయితే పీఎంఎల్ఏ, సెక్షన్ 65, 71 కింద తమకు ప్రత్యేక అధికారాలు ఉన్నందున ఎలాంటి అనుమతులు అవసరం లేదని ఈడీ వాదించింది.
సుదీర్ఘ వాదనల తర్వాత.. 2019, జనవరి 21న తెలంగాణ హైకోర్టు ఆచార్యకు ఊరట కల్పిస్తూ స్పెషల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై బుధవారం విచారించిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది.