
నటిగా కెరీర్ స్టార్ట్ చేసినా, నిర్మాతగా సెటిలైపోయారు సుప్రియ యార్లగడ్డ. ప్రొడ్యూసర్‌గా తన మార్క్ చూపించాలని తపన పడుతున్నారు. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి డైరెక్షన్‌లో ఆమె నిర్మించిన ‘అనుభవించు రాజా’ ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాసేపు ముచ్చటించారు.
‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌ని తాతగారు (ఏఎన్నార్) కట్టిస్తే, చినమామ (నాగార్జున) నిలబెట్టారు. ఈ బ్యానర్‌లో సినిమా అంటే కథలన్నీ దాదాపు నేనే వింటాను. చినమామ, చైతూల కోసం కథలు వస్తే మాత్రం వాళ్లకే ముందు వినిపిస్తాను. ఏదేమైనా కానీ నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ‘అనుభవించు రాజా’ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వానంటే పదిమంది నవ్వుతారనే నమ్మకంతో నిర్మించడానికి రెడీ అయ్యాను. మన జోకులు, మన నేటివిటీతో అందరూ కనెక్టయ్యేలా, పెద్ద వంశీ గారి సినిమాలా ఉంటుంది. థియేటర్స్ నుంచి బయటికి రాగానే ఓ మంచి తెలుగు సినిమా చూశామనే ఫీలింగ్ వస్తుంది. రాజ్ తరుణ్‌లోని కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. అది ఈ సినిమాకి ప్లస్. టోటల్‌గా సరదా సరదాగా సాగే సినిమా. మూవీకి పెట్టిన ఖర్చు స్ర్కీన్‌పై కనిపించాలనుకుంటాను నేను. అందుకే చిన్న సినిమాల విషయంలో కూడా కాంప్రమైజ్ కాను. అసలు చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీయే ఉండదు. వాటివల్లే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వేల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాలను బాగా తీయగలం.
చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ‘గూఢచారి’ సినిమాలో నటించడంతో నటిగా కూడా కంటిన్యూ అవ్వమంటున్నారు నన్ను. అయితే అన్నీ పోలీసాఫీసర్ పాత్రలే వస్తున్నాయి. చేసినవే ఎన్నిసార్లు చేస్తామని ఒప్పుకోవడం లేదు. మంచి క్యారెక్టర్ ఇస్తే తప్పకుండా చేస్తాను. ఫ్యూచర్‌లో డైరెక్షన్ కూడా చేస్తానేమో తెలీదు. ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్‌లో నాలుగు టీవీ సీరియళ్లు, నాలుగు వెబ్ సిరీస్‌లు, ఒక చిన్న సినిమా, ఒక పెద్ద సినిమా నిర్మాణం జరుగుతోంది. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం పూర్తిగా మారడం లేదు. ఇంకా మూస ధోరణి
లోనే ఆలోచిస్తున్నారు. కొత్త కథలు రావాలి.’’