సూరమ్మ రిజర్వాయర్ పనులు అటకెక్కాయి

  • రూ. 204 కోట్ల రిజర్వాయర్ వర్క్స్ పై ఆఫీసర్ల నివేదిక
  • హామీ  మరిచిన సర్కార్ .. ఎదురుచూస్తున్న 43 గ్రామాల రైతులు  

జగిత్యాల, వెలుగు : కథలాపూర్ మండలం కలిగోట గ్రామ శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చే పనులు అటకెక్కాయి.  సూరమ్మ చెరువు ను రిజర్వాయర్ గా చేసి నాలుగు మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగు నీరివ్వాలని 15 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.  ఎల్లంపల్లి నుంచి నీళ్లు తెచ్చి రిజర్వాయర్ నింపి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్లాన్ చేశారు.  ఇప్పటి వరకు  కేవలం రిజర్వాయర్ కోసం భూసేకరణ మాత్రమే కంప్లీట్ చేశారు.  కాల్వల కోసం భూసేకరణ చేయక అలాగే వదిలేశారు.  దీంతో భూములన్నీ బీడువారి రైతులు ఆవేదన చెందుతున్నారు. కలిగోట, అంబారిపేట, రుద్రంగి గ్రామాల సరిహద్దుల్లో సుమారు 650 ఎకరాల భూమిని సేకరించారు. పరిహారం విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత సమస్య పరిష్కారమైంది.  కానీ కాల్వల కోసం భూసేకరణ మాత్రం ఇంకా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018, జూన్ 22న మంత్రి హరీశ్ రావు కాల్వల పనుల కోసం భూమి పూజ చేశారు. రూ.204 కోట్ల ఖర్చుతో కాల్వలు తవ్వుతామన్నారు. త్వరలోనే నీళ్లిస్తామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. 

ఎదురుచూస్తున్న 43 గ్రామాల రైతులు

సూరమ్మ రిజర్వాయర్ ద్వారా కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల, మెట్ పల్లి మండలాల్లోని 43 గ్రామాలకు నీళ్లివ్వాలని ప్లాన్ చేశారు. కుడి కాల్వ 19.4 కి.మీ, ఎడమ కాల్వ 14.85 కి.మీ పొడవునా నిర్మించాలని నిర్ణయించారు. కాల్వల కోసం ఎంత భూమి సేకరించాలో సర్వే చేశారు. 521 ఎకరాలు అవసరమవుతాయని ప్రపోజల్స్ పంపారు. ఇప్పటి వరకు భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.  ఎల్లంపల్లి నుంచి సూరమ్మ చెరువుకు నీళ్లు తరలించడానికి నిర్మిస్తున్న కాల్వ సైతం ఇంకా పూర్తి కాలేదు. అర కిలోమీటర్ మేర పనులు ఆగిపోయాయి. కొంతమంది  రైతుల భూమికి పరిహారం తక్కువగా నిర్ణయించడంతో వారు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. 

ఎన్నికల హామీగానే : దాదాపు పదేళ్లుగా వేములవాడ నియోజకవర్గ రాజకీయాలన్నీ సూరమ్మ చెరువు చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల టైంలో ఎమ్మెల్యే 
అభ్యర్థులందరూ సూరమ్మ చెరువును రిజర్వాయర్ చేస్తామని, 50 వేల ఎకరాలను నీళ్లిస్తామని హామీలిచ్చారు. ఎమ్మెల్యే రమేశ్​​ బాబు సైతం ఈ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. ప్రభుత్వం స్పందించి కాల్వల నిర్మాణం త్వరగా పూర్తి చేసి నీళ్లివ్వాలని రైతులు కోరుతున్నారు.

 రిజర్వాయర్ గా మార్చితే రైతులకు మేలు 

రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా గ్రామం లో చెరువు ఉన్నా చుక్క సాగు నీరు లేదు. కాలువలు నిర్మించి, సూరమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చితే భూగర్భ జలాలు పెరగుతాయి. కాల్వ కింద ఆయకట్టు  రైతులకు సాగు నీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.  ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి.
-  రైతు కోటగిరి శంకర్, లింగపేట్, మేడిపల్లి

భూ సేకరణ కు సర్వే చేశాం

సూరమ్మ చెరువు ప్రాజెక్టు ఎల్లంపల్లి ఎత్తిపోతల కుడి , ఎడమ కాలువ భూ సేకరణ పనుల కోసం 19 గ్రామాల్లో 521 ఎకరాల్లో సర్వే చేశాం. నివేదిక ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు రాకపోవడం తో ఎలాంటి పనులు మొదలు కాలేదు.  
- రఫీ, డీఈ, ఎల్లపల్లి ఎత్తిపోతల సెక్షన్.