- తల్లిని దక్కించుకోవాలన్న ఆశతో బిడ్డ హత్య
- మేడ్చల్ జిల్లాలో ఘటన
- ఫ్యామిలీ మొత్తాన్ని చంపే ప్లాన్
జీడిమెట్ల, వెలుగు: మేడ్చల్ జిల్లాలో ఏడేండ్ల బాలిక హత్య కేసును సూరారం పోలీసులు ఛేదించారు. తల్లిని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతోనే ఆమె బిడ్డను చంపేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. మామా అని నమ్మి వెళ్లిన బాలికను గొంతు కోసి, కడుపులో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడకు చెందిన ప్రభాకర్.. అదే ప్రాంతానికి చెందిన సుమతో కలిసి కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీలో సహజీవనం చేస్తున్నాడు.
సుమకు జోత్స్న (7), సారిక (5) బిడ్డలు ఉన్నరు. సూరారం కాలనీ దయానంద్నగర్కు చెందిన తిరుపతి.. పాటగూడకు చెందిన అర్జున్ ద్వారా ప్రభాకర్‌కు పరిచయం అయ్యాడు. ప్రభాకర్ ఇంటికి తిరుపతి తరుచూ వచ్చేవాడు. ప్రభాకర్‌తో సుమ సహజీవనం చేస్తున్నదని తెలుసుకున్న తిరుపతి.. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నడు. అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. ఇద్దరు పిల్లలు, ప్రభాకర్‌ను చంపేస్తే సుమ తన సొంతం అవుతుందని ప్లాన్ వేశాడు.
ఈ నెల 12వ తేదీ దసరా రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి తన బైక్‌పై ప్రభాకర్ ఇంటికి వచ్చాడు. తిరిగివెళ్లిపోతుండగా జోత్స్న ఎదురై.. ‘‘మామా నేనూ నీతో వస్తా’’అని అనడంతో బైక్‌పై ఎక్కించుకున్నాడు. నేరుగా జోత్స్నను తన ఇంటికి తీసుకెళ్లి భార్య వద్ద ఉంచి బయటికి వెళ్లాడు. తర్వాత ఇంటికొచ్చి జోత్స్నను సుమ వద్దకు తీసుకెళ్లేందుకు బండిపై ఎక్కించుకున్నాడు. ‘మీ ఇంటి దగ్గర దించిన తర్వాత ఆడుకుంటానని చెప్పి బయటికి వస్తేనే బండి మీదు తిప్పుతా.. లేకపోతే తిప్పను’అని దారిలో జోత్స్నతో తిరుపతి చెప్పాడు.
బండి ఎక్కాలన్న ఆశతో...
ఇంటికొచ్చాక లోపలికెళ్లిన జోత్స్న.. బండి ఎక్కాలన్న ఆశతో.. తాను బయట ఆడుకుంటానని తల్లి సుమతో చెప్పింది. వీధి చివర అప్పటికే వేచి ఉన్న తిరుపతి.. ఆమెను బండిపై ఎక్కించుకుని సాయంత్రం 5 గంటల నుంచి దూలపల్లి నుంచి మేడ్చల్ వరకు తిప్పాడు. సాయంత్రం 7 గంటలకు బాసరగడి వద్దకు రాగానే.. బండి రోడ్డుపక్కన ఆపి.. జోత్స్నను పొదల్లోకి తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి.. కడుపులో పొడిచి చంపేశాడు.బాలిక కనిపించకపోవడంతో సుమ సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకేం తెలియనట్లే.. బాలిక కోసం వెతుకుతున్నట్లు తిరుపతి నటించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పోలీసులకు తనపై అనుమానం వచ్చిందని తెలుసుకున్న తర్వాత.. తిరుపతి కనిపించకుండాపోయాడు. మొదట ఆదిలాబాద్ వెళ్దామని అనుకున్నడు. భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమెను కూడా తీసుకెళ్దామని దయానంద్నగర్లోని తన ఇంటికొచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు.