నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతలను ఎదిరించిన సాహసి సురవరం ప్రతాపరెడ్డి. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరంగా స్వేచ్ఛా రహిత, చైతన్య రహితంగా ఉన్న సమాజాన్ని మేల్కొలిపింది ఆయనే. సంఘసేవకునిగా, కవిగా, చిత్రకారునిగా, రచయితగా, వ్యాసకర్తగా, పత్రికా సంపాదకునిగా ఇలా తను చేపట్టిన ప్రతి రంగంలోనూ తెలంగాణ ప్రజల బాధలను కళ్లకుకట్టారు. ప్రజలను చైతన్య పరుస్తూ నిజాం పాలకుల దాష్టీకాలపై ముప్పేట దాడి చేశారు. ఇందుకు ఈయన మూడు మార్గాలు ఎంచుకున్నారు. 1. రాజకీయోద్యమం, 2. సంఘసంస్కరణ ఉద్యమం, 3. భాషాసాహిత్యోద్యమం. వీటి కోసం ఎన్ని అవరోధాలు, నిర్బంధాలు ఎదురైనా మడమ తిప్పలేదు.
అక్షరాస్యతను పెంచేందుకు లైబ్రరీలు పెట్టారు
1896 మే 28న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తాలూకా బోరువెల్లి గ్రామంలో సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు. తండ్రి నారాయణరెడ్డి, తల్లి రంగమ్మ. ప్రతాపరెడ్డి చదువుకునే రోజుల్లోనే నిజాం పాలనలో తెలంగాణ ప్రజల జీవనం దయనీయంగా ఉండేది. నిజాం పాలనలో మత స్వేచ్ఛలేదు. పౌర హక్కులు లేవు. భాషా స్వేచ్ఛ లేదు. సభలు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ అంతకన్నా లేదు. ఒక సభలో న్యాయవాది తెలుగులో మాట్లాడితే గేలిచేశారు. ఈ అవమానం తెలుగు మాట్లాడే వారిని “ఆంధ్రజన సంఘం” స్థాపించేలా పురిగొల్పింది. జాతీయోద్యమంగా విప్లవాత్మక మార్పుకు దారి తీసింది. అనాడు తెలంగాణ సమాజంలో అస్పృశ్యత, వెట్టిచాకిరీ, పెత్తందారీతనం, నిరంకుశత్వం రాజ్యమేలుతుండేది. ఆ రోజుల్లో తెలంగాణ ప్రజల్లో ఐదు శాతం మాత్రమే అక్షరాస్యులుగా ఉండేవారు. ఇలాంటి స్థితిలో గ్రంథాలయాలను స్థాపించి అక్షరాస్యతను పెంచే కార్యక్రమాలకు సురవరం పూనుకున్నాడు. వీటికీ నాటి పాలకులు అడ్డుతగులుతుండేవారు. అయినా వాటిని అధిగమించి తన లక్ష్యం దిశగా ఆయన ముందుకు సాగేవారు.
గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై..
మద్రాసులో చదువుకుంటున్నప్పుడు గాంధీ అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహ ఉద్యమం, ఖద్దరు వస్త్రధారణ, మద్యపాన నిషేధం లాంటి వాటికి సురవరం ఆకర్షితుడయ్యారు. గాంధీని స్ఫూర్తిగా తీసుకుని గ్రంథాలయోద్యమానికి తెలంగాణలో పునాది వేశారు. ప్రజలకు మాతృభాషపై అభిమానం పెంచటానికి గోలుకొండ పత్రికను నడిపించారు. దీని ద్వారా ప్రజల్లో స్వాభిమానాన్ని రగిల్చి ఆత్మగౌరవాన్ని చైతన్యపరిచారు. తన రచనలతో నిజాం పాలకుల గుండెల్లో సింహస్వప్నమయ్యారు. కోస్తా ప్రాంతం వారు నడిపే పత్రికలో తెలంగాణలో కవులే లేరని రాశారని మండిపడి, తెలంగాణ కవుల కవితలతో "గోలుకొండ కవులు' అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. చదువుకున్న వాళ్లకు ఉర్దూను బలవంతంగా రుద్దేవారు నాటి పాలకులు. ఒకే రోజు హిందు, ముస్లీంల పండుగవస్తే.. హిందువులకు స్వేచ్ఛ లేకుండా పోయేది. ఇలా భావ దాస్యానికి, భాషా దాస్యానికి, సాంస్కృతిక దాస్యానికి ఒడిగట్టి తెలంగాణ ప్రజలను బానిసలను చేశారు. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యలో ఉండే ప్రజల చరిత్రే నిజమైన చరిత్ర. వారి జీవన సరళిని ప్రతిబింబించేదే చరిత్ర అవుతుంది. స్వల్ప సంఖ్యాకులైన రాజులు, రాజ్యాల చరిత్ర కాదని చెప్పిన గొప్ప విమర్శకుడు.
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు..
పత్రికా సంపాదకునిగా తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఇది తట్టుకోలేని పాలకులు ఎన్నో బెదిరింపులకు పాల్పడేవారు. వాటికి భయపడక తన లక్ష్య సాధన కోసం అనునిత్యం కష్టపడుతూ సంపాదకుడి నుంచి ఫ్రూఫ్ రీడర్, క్లర్కు, అటెండర్ సమస్తం తానై గడ్డు పరిస్థితులను ఎదిరించి పత్రికను నడిపారు. వేర్వేరు కలాల పేర్లతో వ్యాసాలు, కథనాలు రాసేవారు. బహుభాషాకోవిదుడు, పరిశోధకుడు, పండితుడు, నాటకకర్త, కవి, విమర్శకుడు, కథారచన, నవలా రచయిత అలా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియలేదు. వాటిలో ‘‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తన రచనల్లో స్త్రీల సమస్యలు, పెత్తందార్లు, పోలీసులు పౌరులను ఎలా వేధించేవారో, నిజాం నిరంకుశపాలన తీరు, పేదల దయనీయ జీవితాల గురించి కళ్లకు కట్లేలా రాసి అందరి మన్ననలు పొందాడు. 1952లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. అనునిత్యం తెలంగాణ అభివృద్ధికై పరితపించిన సురవరం 1953 ఆగస్టు 25న తుదిశ్వాస విడిచారు.
తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెట్టాలి
నాటి పాలకుల కఠిన ఆంక్షలకు బెదరకుండా వ్యక్తిగా, విభిన్న వ్యవస్థల ప్రతినిధిగా, నిరంతరం ప్రజల పక్షాన నిల్చిన సాహసి ప్రతాపరెడ్డి. ఆయన త్యాగాల స్ఫూర్తి నేటి సమాజానికి ఎంతో అవసరం. నేటి ప్రజాప్రతినిధులు, సాహితీ కారులు, విమర్శకులు, కళాకారులు, చరిత్ర కారులు, యువత ప్రతాపరెడ్డి నిబద్ధత, ఆదర్శాలను గుర్తించి పాలకుల పక్షం కాదు.. ప్రజల పక్షం నిలవాలని గ్రహించాలి. నేటి పాలకులు స్వార్థం వీడి ప్రజల హక్కులు, బాధ్యతలు రెండు కళ్లని భావించాలి. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలి. ఆయన ఆశయ స్ఫూర్తితో లైబ్రరీలను అభివృద్ధి చేయాలి. ఆయన ఆదర్శాలను కొన్నింటినైనా అమలు చేయగలగడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే గౌరవం.
- మేకిరి దామోదర్, వరంగల్